
భారత్ లో షెల్ కంపెనీలు నిర్వహిస్తున్న కీలక సూత్రధారిని ‘ది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ అధికారులు బిహార్లోని మారుమూల ప్రాంతంలో అరెస్టు చేశారు. అతడు దేశ సరిహద్దులు దాటేందుకు యత్నిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. సెప్టెంబర్ 8వ తేదీన గురుగ్రామ్, బెంగళూరుల్లోని జిలియాన్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సంస్థ జిలియాన్ హాంకాంగ్ లిమిటెడ్ కు అనుబంధ కంపెనీ. హైదరాబాద్ కు చెందిన హుసిస్ కన్సల్టింగ్ లిమిటెడ్ పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కంపెనీలు తీవ్రమైన ఆర్థిక నేరాల్లో పాల్గొన్నట్లు ఇప్పటి వరకూ కొనసాగిన దర్యాప్తులో తేలిందని కార్పొరేట్ వ్యవహారాలశాఖ పేర్కొంది.
చైనాతో సంబంధాలు కొనసాగిస్తూ.. భారత్ లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న జిలియాన్ కన్సల్టెంట్ సహా 32 షెల్ కంపెనీలపై దర్యాప్తు చేసే బాధ్యతను ఎస్ఎఫ్ఐవోకు ప్రభుత్వం అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో కీలక సూత్రధారిని అరెస్టు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ప్రాంత వాసిగా చేప్పుకొనే డోర్త్ సేను జిలియాన్ కంపెనీలో బోర్డు సభ్యుడిగా గుర్తించారు. భారత్ లో పెద్ద ఎత్తున చైనా సంస్థ డమ్మీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి, దానికి బోర్డు డైరెక్టర్లను సమకూర్చడానికి డోర్త్ సే పనిచేసినట్లు తేలింది. జిలియాన్ కంపెనీలో డోర్త్ సే తోపాటు మరో చైనా వ్యక్తి డైరెక్టర్ గా ఉన్నట్లు గుర్తించారు.డోర్త్ సే ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి బిహార్లోని మారుమూల ప్రాంతానికి పారిపోయాడు. అక్కడి రోడ్డు మార్గం ద్వారా భారత్ ను దాటేందుకు యత్నిస్తుండగా ఎస్ఎఫ్ఐవో బృందం అతడిని అరెస్టు చేసింది.
ఎస్ఎఫ్ఐవో నిర్వహించిన తనిఖీల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ డమ్మీ కంపెనీల డైరెక్టర్లకు జిలియాన్ నుంచి జీతాల చెల్లింపు జరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. పెట్టెల కొద్దీ కంపెనీ ముద్రలు, డైరెక్టర్ల డిజిటల్ సిగ్నేచర్లు స్వాధీనం చేసుకొన్నారు. భారత ఉద్యోగులు చైనాలోని వ్యక్తులతో ఓ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా టచ్ లో ఉంటున్నట్లు గుర్తించారు. హుసిస్ కన్సల్టింగ్ కూడా జిలియాన్ తరపునే పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ సంస్థకు జిలియాన్ హాంకాంగ్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం ఉంది.





