
గోమాత పరిరక్షణ, భారతీయ సంస్కృతి విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జూలై 10న తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘వందే గోమాతరం–2026’ మహాకార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు 10 వేల మంది విద్యార్థుల భాగస్వామ్యంతో గోమాత పరిరక్షణ ప్రాధాన్యాన్ని చాటిచెప్పే భారీ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారతీయ సంస్కృతిలో గోమాతకు ఉన్న విశిష్ట స్థానాన్ని, గోసంరక్షణ ఆవశ్యకతను యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొనదలచిన విద్యార్థులు ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, 7799884561, విశ్వం సైనిక్ స్కూల్ 7013563928 ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రధాన కో-ఆర్డినేటర్, ఆర్కే విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టి. రామకృష్ణారెడ్డి, విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్. విశ్వచందన్‌రెడ్డి, అన్నమయ్య డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీరామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.





