
భారీ వరదలకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం పాకిస్థాన్ వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1400 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. అయితే, గూడు చెదిరిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కొందరికి ఓ హిందూ దేవాలయం దిక్కయింది. చుట్టుపక్కల ప్రాంతమంతా వరదల్లో మునిగిపోగా… ఆ గుడి మాత్రం వరదబారిన పడకపోవడం గమనార్హం. 200-300 మందికి ఆ ఆలయం ఆశ్రయమిస్తోంది. కాగా అందులో ఆశ్రయం పొందుతున్నవారిలో ఎక్కువ మంది ముస్లింలే కావడం విశేషం.
కచ్చి జిల్లాలోని జలాల్ ఖాన్ అనే చిన్న గ్రామంలో ఉంది బాబా మదోదాస్ ఆలయం. వరదల కారణంగా నారీ, బోలన్, లెహ్రీ నదులు ఉప్పొంగడంతో ఈ గ్రామం ఇతర ప్రావిన్స్ ల నుంచి సంబంధాలను కోల్పోయింది. అయితే, భారీ వరదలు వచ్చినప్పటికీ.. మదోదాస్ ఆలయం మాత్రం ముంపునకు గురికాలేదు. ఈ నేపథ్యంలోనే వరద బాధిత ప్రజల సహాయార్థం స్థానిక హిందూ సమాజం ఆ ఆలయ ద్వారాలు తెరిచింది. దీంతో ఆ హిందూ ఆలయంలో కులమతాలకు అతీతంగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని ‘డాన్’ పత్రిక వెల్లడించింది. పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని పేర్కొంది.





