
సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మొబైల్ ఫోన్లే వేదికగా అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్ వల విసురుతున్నారు. ఫలానా లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే ఉద్యోగాలొస్తాయి, డబ్బులొస్తాయంటూ ఆశలు రేపి నిలువునా దోచేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట అలాంటి నకిలీ ఎస్‌ఎంఎస్ ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ యోజన కింద అర్హులైన వ్యక్తులకు నెలవారీగా ఆకర్షణీయమైన శాలరీ వస్తుందని, ఇందుకోసం కింద పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయాలంటూ వస్తోన్న సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ యోజన కింద రూ.78,856ల శాలరీకి మీరు ఎంపికయ్యారు. ఈ లింక్ పై క్లిక్ చేస్తే నెలకు రూ.50వేలు చొప్పున ఆదాయం పొందొచ్చంటూ ఉన్న స్క్రీన్ షాట్ ని కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఇది పూర్తిగా నకిలీ సందేశమని, ఇలాంటివాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. అలాంటి పథకమేదీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయడంలేదని స్పష్టం చేసింది.





