
కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకున్న గులాం నబీ ఆజాద్ తన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరగబోయే భారీ ర్యాలీలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నేడు ఢిల్లీ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో జమ్మూకు చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికేందుకు ఆయన మద్దతుదారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు.
అక్కడి నుంచి భారీ ర్యాలీతో సైనిక్ కాలనీకి బయలుదేరనున్నారు. అక్కడ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దాదాపు 20 వేల మంది మద్దతుదారులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ సభలోనే ఆయన కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు తెలిపారు. జాతీయ పార్టీ అయినప్పటికీ.. తొలుత జమ్మూ-కశ్మీర్ శాఖతో ప్రయాణం ప్రారంభించనున్నారు.
జమ్మూ-కశ్మీర్‌లో ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆజాద్ కు మద్దతుగా పార్టీని వీడిన విషయం తెలిసిందే. వీరంతా నేడు ఆజాద్ తో సభకు హాజరవనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ను వీడిన వారిలో జమ్మూకశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మాజిద్ వాణి, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ తదితరులు ఉన్నారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే అశోక్ శర్మ సైతం కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.
ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకొని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేనప్పటికీ.. అన్ని నిర్ణయాలూ రాహులే తీసుకుంటారని విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాతే పార్టీ పతనం ప్రారంభమైందంటూ ఘాటు విమర్శలు చేశారు.





