News

పోలీస్ స్టేషన్ లో వినాయకుడు

412views

దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడికి పూజలు చేస్తూ భక్తులు తరిస్తున్నారు. తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు. కానీ బిహార్ నలందలోని ఓ వినాయకుడు మాత్రం ఏడాదిలో 355 రోజులు పోలీసుస్టేషన్‌లో పోలీసుల సంరక్షణలోనే ఉంటాడు. 10 రోజులు మాత్రమే భక్తులకు కనిపిస్తాడు. ఈ 10 రోజులు భక్తులు ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తారు.

అయితే, ఈ విగ్రహానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ వినాయక ప్రతిమ 150 ఏళ్ల పురాతనమైనదని ఆ ఆలయ పూజారి గోవింద్ రామ్ తెలిపారు. అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పాలరాయితో తయారు చేసిన ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని.. దొంగల నుంచి కాపాడేందుకే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్ ఆవరణలో ఉన్న మందిరంలో వినాయకుడిని ఉంచుతున్నట్లు తెలిపారు.

‘పాలరాయితో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.గతంలో పూజల కోసం బయటకు తీసుకొచ్చినప్పుడు దొంగిలించేందుకు దొంగలు పలుమార్లు ప్రయత్నించారు. ఓసారి ఎత్తుకెళ్లిపోయారు కూడా. కానీ స్థానికులు వారిని పట్టుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకే దాని భద్రత కోసం సిలావ్ పోలీసుస్టేషన్​ఆవరణలోని దేవాలయంలో ఉంచుతాం. వినాయక చవితి సమయంలో 10 రోజులు బయటకు తెచ్చి ఘనంగా వేడుకలు నిర్వహిస్తాం. తర్వాత మళ్లీ అక్కడే భద్రపరుస్తాం’ అని పూజారి వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.