
సైనిక సంక్షేమ నిధికి భారత క్రికెట్ నియంత్రణ మండలి రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ప్రారంభ వేడుకలకు అయ్యే ఖర్చు రూ. 15 కోట్లతో పాటు అదనంగా మరో ఐదు కోట్లు జతచేసి సంక్షేమ నిధికి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ నెల 23న ఐపీఎల్ మొదలుకాబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో త్రివిధ దళాల ఉన్నతాధికారులను అతిథులుగా పిలిచి ఈ విరాళాన్ని అందించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక రాంచీ వన్డేలో ఆర్మీ క్యాప్‌తో బరిలో దిగిన టీమిండియా ఆటగాళ్లు.. ఆ మ్యాచ్ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు.
ఐపీఎల్ పూర్తి షెడ్యూలును మార్చి 18న విడుదల చేస్తారని తెలుస్తోంది. సోమవారం క్రికెట్ పాలకుల కమిటీ ముంబయిలో సమావేశం కానుంది. అదే రోజున షెడ్యూలుపై తుది నిర్ణయం వెలువడనుందని తెలిసింది. ఎన్నికల గురించి పూర్తీ షెడ్యూల్ రాకపోవడంతో 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌నే బీసీసీఐ గతంలో విడుదల చేసింది. సోమవారం పూర్తి షెడ్యూల్ రాబోతోంది.





