
-
గ్రామానికి నగదు బహుమతిని ప్రకటించిన ప్రభుత్వం
కశ్మీర్: భారీ ఆయుధాలతో ఉన్న ఇద్దరు లష్కర్ ఏ తయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు ధైర్యంగా పట్టుకొని తమకు అప్పగించారని జమ్మూ-కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇటీవల జరిగిన రాజౌరీ మందుపాతరల పేలుళ్ళ సూత్రధారి తాలిబ్ హుసేన్ కూడా ఇందులో ఉన్నట్టు వివరించారు. ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన రియాసీ జిల్లా టక్సన్‌ధోక్ గ్రామస్థులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డీజీపీ దిల్‌బాగ్‌సింగ్ అభినందించారు.
గ్రామానికి లెఫ్టినెంట్ గవర్నర్ రూ.5 లక్షలు, డీజీపీ రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ఉగ్రవాది తాలిబ్ హుసేన్ రాజౌరి జిల్లావాసి అని, మరొకరిని పుల్వామాకు చెందిన ఫైసల్ అహ్మద్‌దార్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరి వద్ద రెండు ఏకే రైఫిళ్ళు, ఏడు గ్రనేడ్లు, పిస్టల్ తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.





