News

గ్యాంగ్ రేప్‌ కేసు.. బెంజ్‌ కారులో సాక్ష్యాలు ల‌భ్యం!

443views

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ళ బాలికపై గ్యాంగ్ రేప్‌ కేసు దర్యాప్తులో బెంజ్‌ కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పు కూడా క్లూస్‌ టీమ్‌ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక వెంట్రుకలు దొరకగా వాటితో పాటు.. నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్‌ బృందం గుర్తించింది. వీర్య నమూనాలు, బాలిక వెంట్రుకలు ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు.

ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపించిన పోలీసులు మరో నిందితుడు ఉమర్​ఖాన్​ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం రిమాండ్​కు తరలించనున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు.

ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్‌​ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా, రెండు కార్లను క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు. కేసు నమోదు చేసిన మరుసటి రోజు బెంజ్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు, మూడు రోజులు పట్టించుకోలేదు.

ఇన్నోవా కారును ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం మొయినాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు వాహనం చిక్కకుండా మొయినాబాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్‌ వెనుక దాచేశారనే అనుమానాలున్నాయి. కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్‌ కనిపిపించకుండా, టీఆర్‌ నంబర్‌ కూడా గుర్తుపట్టకుండా చెరిపేసే ప్రయత్నం చేశారు.

జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన ఆ బాలికను ఇంటి వద్ద దిగబెడతామ‌ని ప్రభుత్వ సంస్థ చైర్మ‌న్ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజ్‌ కారులో ఎక్కించుకున్నారు. అందులో పబ్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్నప్పుడే బాలికపై అత్యాచారయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సు బేకరీ వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడికి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకురాగా.. ప్రభుత్వ సంస్థ చైర్మ‌న్ కుమారుడు ఇప్పుడే వస్తామంటూ వేచి ఉండాలని డ్రైవర్‌కు చెప్పి అతడిని వదిలి వెళ్ళిన‌ట్టు సీసీఫుటేజీల్లో ఆధారం ల‌భించింది.

కాగా, సాదుద్దీన్‌ మాలిక్‌(18), అమేర్‌ ఖాన్‌(18)తో పాటు ప్రభుత్వ సంస్థ చైర్మ‌న్ కుమారుడు(16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కుమారుడు(16), బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు(16) కలిసి బాలికను బెదిరించి బెంజ్‌ కారు నుంచి ఇన్నోవా వాహనంలో ఎక్కించి తీసుకెళ్ళారు.

ఆ సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు(17) కూడా ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్ళాడని పోలీసులు వెల్లడించారు. సోష‌ల్ మీడియాలో హల్‌చల్‌ అయిన వీడియో నేపథ్యంలో మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకోవాల‌ని పోలీసులు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకుని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి