ArticlesNews

పతనం అంచున పాక్‌

477views

* శ్రీలంక బాటలోనే పాకిస్థాన్

* వరుస సంక్షోభాలతో సతమతం

* పెరిగిన ద్రవ్యోల్బణం.. భారీగా అప్పు

* విద్యుత్తు సంక్షోభంతో కరెంట్‌ కోతలు

* రాజకీయ అస్థిరతతో పరిస్థితి తీవ్రం

పాకిస్థాన్ లో ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.. అంతర్జాతీయంగా అప్పు పెరిగింది.. తిరిగి చెల్లించాల్సిన సమయం ముంచుకొచ్చింది. కొత్త అప్పు పుట్టే అవకాశం లేదు. దీనికి తోడు రాజకీయ అస్థిరత.. వెరసి పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్థాన్‌ దివాలా తీయడానికి, మరో శ్రీలంకలాగా కావడానికి ఎంతో కాలం పట్టదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు,. పాకిస్థాన్‌ తీవ్ర విద్యుత్తు సంక్షోభం ఎదుర్కొంటున్నది. దేశంలో 26 వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉండగా, కేవలం 19,500 మెగావాట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దేశంలో 6,500 మెగావాట్ల లోటు ఉన్నది. దాదాపు 12 గంటల పాటు కరెంటు కోతలు అమలవుతున్నాయి. ఇది పరిశ్రమలపై, తద్వారా ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతున్నది.

పెరిగిన వాణిజ్య లోటు

పాకిస్థాన్‌ తన అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. కరోనా సంక్షోభంతో దిగుమతులపై ప్రభావం పడింది. స్థానికంగా ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం… పరిస్థితిని మరింత దిగజార్చింది. మరోవైపు, అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో పాకిస్థాన్‌లో ఏటికేడు వాణిజ్య లోటు పెరుగుతూ వస్తున్నది. గతేడాది వాణిజ్య లోటు 45 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీనికి తాజా రాజకీయ సంక్షోభం తోడైంది. ఫలితంగా పాక్‌ రాజకీయాల్లాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా డోలాయమానంలో పడిపోయింది.

విదేశీ అప్పులు 90 బిలియన్‌ డాలర్లు

పాకిస్థాన్‌ విదేశీ అప్పులు 90 బిలియన్‌ డాలర్లు దాటాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌ దగ్గర కేవలం 10.2 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ అప్పు కోసం పాకిస్థాన్‌ ఇటీవలే ఐఎంఎఫ్‌ను సంప్రదించింది. 3 బిలియన్‌ డాలర్ల అప్పు కోరింది. అయితే ఐఎంఎఫ్‌ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనికి పాక్‌లో రాజకీయ అస్థిరతే ప్రధాన కారణం. ఎప్పుడు ఎవరు ప్రధానిగా ఉంటారో, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో తెలియని పరిస్థితి. అప్పు ఇవ్వాలంటే పాకిస్థాన్‌పై కఠినమైన రాజకీయ, ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

– ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.