
* మయన్మార్ కోర్టు నిర్ణయం
అవినీతి కేసులో ఆంగ్ సాంగ్ సూకీకి మయన్మార్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. మిలటరీ పాలనలో ఉన్న మయన్మార్‌లోని ఒక న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించింది. ఆమెపై అనేక అవినీతి కేసులలో తొలిసారిగా బుధవారం సూకీకి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఆర్మీ టేకోవర్ తో పదవీచ్యుతురాలైన సూకీ, తాను బంగారం, నగదును స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఒక అగ్ర రాజకీయ సహచరుడు ఆమెకు వేల డాలర్లు లంచంగా ఇచ్చాడు. ప్రస్తుతమున్న మిలిటరీ ప్రభుత్వం ఆమెను అప్రతిష్టపాలు చేయడానికే ఇదంతా చేస్తోందని ఆమె మద్దతుదారులు, స్వతంత్ర న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 76 ఏళ్ల సూకీ తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రాకుండా ఉండేలా ప్రస్తుతమున్న నియంతృత్వ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకురాలిని తిరిగి రాజకీయాలలోకి, అధికారంలోకి రానీయకుండా చెయ్యడానికే సైనిక ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.





