ArticlesSeva

నిర్మల భక్తికి నిదర్శనం సంత్ రవిదాసు.

1.1kviews

ఈ రోజు సంత్ రావిదాసు జన్మ తిథి. భక్తియుగంలో ప్రసిద్ధి చెందిన సంతులలో ప్రముఖుడు క్రీ.శ. 16వ శతాబ్దానికి చెందినవారు సంత్ రవిదాసు. వీరు చెప్పులు కుట్టి జీవించే చమార్ [మాదిగ] కులమునందు జన్మించారు. వీరు కాశీ పట్టణ వాస్తవ్యులు. వీరు ప్రముఖ విష్ణు భక్తుడైన రామానందుని అనుయాయీలలో ఒకరు. చెప్పులు కుట్టే వృత్తిని కొనసాగిస్తూనే వీరు తన అసాధారణ కృష్ణ భక్తిని తన రచనలలో సహజ సుందరంగా స్వచ్ఛంగా ప్రకటించారు. సంత్ కబీర్ దాసుకు పూర్తి భిన్నమైన రీతిలో రవిదాసు మిక్కిలి సౌమ్య స్వభావము కలిగిన సాధు పురుషుడు, సౌజన్య మూర్తి. కబీరునొకసారి ఎవరో బ్రహ్మ జ్ఞానం గురించి ప్రశ్నించగా, “ నేను తల్లి ఒడిలో కూర్చుని వచ్చిన వాడిని, నాకేమి తెలుసు? రవిదాసునడగండి తల్లి ఇచ్చిన సరుకుల మూటలు మోసుకొచ్చిన వాడాయన. ఆ మార్గం ఆయనకు బాగా తెలుసు.” అని సమాధానమిచ్చాడట. ఎంత దుర్మార్గుడైనా గానీ సత్సంగ ప్రభావంతో సజ్జనుడవుతాడని రవిదాసు గట్టి నమ్మకం. ఇంకా ఈ సత్సంగ ప్రభావం వల్లనే తాను నిమ్నకులంలో జన్మించినా, సంఘంలో ఉచ్ఛ స్థాయికి ఎదగగలిగానని, అన్ని వర్గాల వారికీ వంద్యుడనైనానని చెప్పేవాడు. తన పేరు ప్రతిష్ఠలన్నిటికీ ఆ సద్గురు సాంగత్యం, ఆ పరమేశ్వరుని పట్ల గల నిశ్చల భక్తి ప్రపత్తులే కారణమని వినయంగా, స్పష్టంగా చెప్పుకున్నాడు.