News

కళ్యాణం, కమనీయం….ఎస్.ఎస్.ఎఫ్, తితిదే ల అధ్వర్యంలో వాడ వాడలా వేంకటేశుని కల్యాణం… పులకించిన జన మానసం.

1.5kviews

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు

కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు

పేరు గల జవరాలీ పెండ్లి కూతురు

పెద్ద పేరుల ముత్యాల మెడా పెండ్లి కూతురు

పేరంటాండ్ల నడిమీ పెండ్లి కూతురు

విభు పేరు జెప్ప సిగ్గువడీ పెండ్లి కూతురు…..

చిరు నవ్వులు చిందిస్తూ పట్టు వస్త్రాలు ధరించి చలువ పందిరి క్రింద పెళ్లి పీటలెక్కాడు ఆ కొత్త పెళ్లి కొడుకు. ధగ ధగ మెరిసిపోతున్న బంగరు జరి అంచు చీరతో, ఓ పక్క ఆభరణాలు, మరో పక్క సిగ్గుల మూటల బరువుకి తల వాలి పోతుంటే నేల చూపులతో అడుగులో అడుగేసుకుంటూ నడచి వస్తున్నదదిగో నవ వధువు. పవిత్ర వేద మంత్రోచ్ఛాటన నడుమ కొంటె చూపుల కొండల రాయడు మూడు ముళ్ళేశాడు. మంగళ వాయిద్యాలతో మండపం మార్మోగిపోయింది. ఏడడుగులు నడిచి ఏడేడు జన్మాలు మనసున మనసై, అడుగున అడుగై కలసి నడుస్తామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి, ముత్యాల తలంబ్రాలతో ఒక్కటైంది ఆ ముచ్చటైన జంట. ఆ జంటను చూసి ఊరు ఊరంతా మురిసిపోయింది. ఆ వరుడు వేంకటేశుడు. వధువు ఆకాశ రాజు కుమార్తె పద్మావతి.

ఆ అలమేలు మంగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ముంగిట సిగ్గుల మొగ్గ అయింది. ఆ ముసి ముసి నవ్వుల ముగురమ్మల మూలపుటమ్మను చూసి ప్రతి పల్లె పరవశించింది. ఆ ఆది దంపతులకు వాడ వాడలా జన  నీరాజనాలు, మంగళ హారతులు, మొక్కులు, నైవేధ్యాలు.

ఏడు కొండల పై కొలువుదీరి వున్న కొండలరాయడు తన దేవేరితో కలిసి ఏడు కొండలూ దిగి తెలుగు నాట పల్లె పల్లెనూ తన పవిత్ర పద స్పర్శతో పావనం చేస్తున్నాడు.

సమరసతా సేవా ఫౌండేషన్, తితిదేల సంయుక్త అధ్వర్యంలో తెలుగు నాట జరుగుతున్న శ్రీనివాస కళ్యాణాలతో పల్లె పల్లెనా కళ్యాణ శోభ కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 120 స్థలాల్లో శ్రీనివాస కళ్యాణాలు వైభవోపేతంగా జరిగాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెళితే గాని ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం లభ్యం కాదు. అలాంటిది తమ ముంగిటే ఆ దేవదేవుని కళ్యాణం జరుగుతుండడంతో ప్రజలు ఆనంద పరవశులవుతున్నారు. భక్తితో ఆ స్వామి వారికి నైవేధ్యాలు సమర్పించుకుంటున్నారు.

సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ త్రినాథ్ మాట్లాడుతూ భక్తి ద్వారానే వ్యక్తులలో సద్గుణ వికాసం జరుగుతుందని, అందుకే మన పూర్వీకులు భక్తి మార్గానికంతటి ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. పల్లె పల్లెకు, గుండె గుండెకు ఆ శ్రీనివాసుని చేరువ చేసి ప్రజలలో భక్తి, ధార్మిక భావనను జాగృతం చెయ్యడం ద్వారా వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక జీవన వికాసాన్ని సాధించదలచి ఎస్.ఎస్.ఎఫ్, తి.తి.దే తో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.

అడ్డ తీగెల, రాజ వొమ్మంగి, కూనవరం, మారేడుమిల్లి, ఎటపాక, జంగారెడ్డి గూడెం, కుప్పునూరు, T. నరసాపురం, కామవరపు కోట వంటి 120 ప్రాంతాల్లో ఇప్పటి వరకు శ్రీనివాస కళ్యాణాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని, గ్రామాలలోని ప్రజలు, అత్యంత ఉత్సాహము, శ్రద్ధా భక్తులతో ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, తాము ఊహించినదానికంటే ఎక్కువగా ప్రజలనుంచి విశేష స్పందన లభించడం తమకు కూడా మిక్కిలి ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించేదిగా వుందని తెలిపారు. ఇలాగే ఈ శ్రీనివాస కళ్యాణ కార్యక్రమాలు రాష్ట్రమంతటా మిగిలిన ప్రాంతాలలో కూడా జరుగనున్నాయి.