News

ఉక్రెయిన్ సంక్షోభం… రాష్ట్రపతి కోవింద్‌‌తో ప్రధాని మోదీ భేటీ

405views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశపు ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలిసే ముందు ప్రధాని ఉక్రెయిన్ పరిస్థితిపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమయంలో నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు భారతదేశ ప్రత్యేక రాయబారులుగా పంపించాలని ప్రధాని నిర్ణయించారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను తరలించే ఆపరేషన్‌ను సమన్వయం చేసేందుకు మోదీ మంత్రులను పంపించారు. హర్దీప్ పూరీ హంగేరీలో ఉండగా, పోలాండ్‌లో భారతీయుల తరలింపు కార్యకలాపాలను వీకే సింగ్ పర్యవేక్షిస్తారు.

రొమేనియా, మోల్డోవా నుంచి తరలింపు ప్రయత్నాలను జ్యోతిరాదిత్య సింధియా చూసుకుంటారు. కిరణ్ రిజిజు స్లోవేకియాలో ఉక్రెయిన్ నుంచి భూ సరిహద్దుల ద్వారా వచ్చిన భారతీయుల తరలింపును పర్యవేక్షిస్తారు. మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 182 మంది భారతీయ పౌరులతో ఏడవ తరలింపు విమానం ఆపరేషన్ గంగాలో భాగంగా భారతదేశానికి తిరిగి వచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి