
-
భారత్ మాల పరియోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి.
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె- తిరుపతి ఫోర్ లైన్ కు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
భారత్ మాల పరియోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో ఎన్ హెచ్-71లో తొలివిడతగా మదనపల్లె- పీలేరు మధ్య 55.9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
తిరుపతి- మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్ రోడ్డుతో ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. వై ఎస్ ఆర్ సీ పీ ఎంపీ మిథున్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఈ విషయమై పలుమార్లు కలిసి మీడియం ప్రయారిటీలో ఉన్న ఈ ప్రాజెక్టును హై ప్రయారిటీ జోన్‌లో చేర్పించారు. ఎంపీ వినతిని పరిగణనలోనికి తీసుకున్న కేంద్రమంత్రి గడ్కరీ… మదనపల్లె- తిరుపతి ఫోర్ లైన్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేశారు.
డీబీఓటీ విధానంలో….
మదనపల్లె- చెర్లోపల్లె (తిరుపతి) జాతీయ రహదారిని మొత్తం 103 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయించారు. తొలివిడతగా మదనపల్లె- పీలేరు మధ్య 55.9 కిలోమీటర్ల నిర్మాణానికి ప్రస్తుతం రూ.1,852.12 కోట్ల బడ్జెట్ కేటాయించారు. హైబ్రీడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఏఎం) విధానంలో 40శాతం నిధులను కేంద్రప్రభుత్వం ఐదు విడతలుగా విడుదల చేయనుంది. మిగిలిన 60శాతం నిధులను డెవలపర్ వెచ్చించుకోవాల్సి ఉంటుంది. డెవలప్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఓటీ) విధానంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది.





