
-
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
భాగ్యనగరం: రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని చెబుతూ ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం ప్రవచన మండపంలో భక్తులనుద్దేశించి ప్రసంగీస్తూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతిమను దూరం నుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుందని చెప్పారు.
రామానుజాచార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని తెలిపారు. అనేక యుగాల వరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుందని చెబుతూ సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుందని పేర్కొన్నారు.
రామాయణ, భారత కాలాలనుంచి నుంచి ఇప్పటివరకు సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుందని, సనాతన ధర్మం యాత్ర ఆగిపోదని అమిత్ షా స్పష్టం చేశారు. పైగా, ప్రపంచమంతా విస్తరిస్తుందని చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందుకు సాగుతున్న చిన్నజీయర్ స్వామికి ఆయన అభినందనలు తెలిపారు.
“నేను జన్మతా వైష్ణవుడిని. ఇంతమంది ఆచార్యులు, సాధు సంతవులు ముందు విశిష్టాద్వైతం గురించి మాట్లడలేను. రామానుజాచార్యుడు గురువు ఆదేశాలను ధిక్కరించి ఆయన బోధించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికి వినిపించారు. ఆలయం శిఖరంపైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సాధారణ ప్రజలకు వినిపించారు” అని పేర్కొన్నారు.
రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్ని సూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారని అమిత్ షా కొనియాడారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడి బోధనలు చేశారని అంటూ రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహం తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయని గుర్తు చేశారు.
ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాలల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని అంటూ సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారని చెప్పారు. వినమ్రత, సంస్కరణ కోసం చేసే విప్లవం ఇవి రెండు కలిస్తేనే ఉద్ధరణ ప్రక్రియ ఆవిష్కారమవుతుందని తెలిపారు.
దేవాలయాలు, గృహాల్లో పూజ చేయడానికి రామానుజాచార్యుడు విధి విధానాలను నిర్దేశన చేశారని అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్ చేరుకున్నారు.
Source: Nijamtoday





