News

కేరళలో మానవ హక్కులకు విఘాతం కలుగుతోంది – కేంద్రం జోక్యం చేసుకోవాలి – రాష్ట్ర వ్యాప్త ధర్నాలో వక్తల గర్జన.

644views

శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తూ ఇటీవల సుప్రీమ్ కోర్టు వెలువరించిన తీర్పును సాకుగా చూపి కేరళలోని కమ్యునిస్టు ప్రభుత్వం శబరిమల ఆలయ ఆచారాలపైన, అయ్యప్ప భక్తుల విశ్వాసాలపైన జరుపుతున్న దాడులకు నిరసనగా శబరిమల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ రోజు ధర్నా జరిగింది.

అందులో భాగంగా విజయవాడలోని ధర్నా చౌక్ లో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవాహ శ్రీ వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ వేల సంవత్సరాల శబరిమల ఆలయ సాంప్రదాయాలను, భక్తుల విశ్వాసాలను  పరిగణనలోనికి తీసుకోకుండా సుప్రీమ్ వెలువరించిన తీర్పు ఇంతటి గందరగోళానికి కారణమైందన్నారు. కేరళలోని హిందూ వ్యతిరేక కమ్యునిస్టు ప్రభుత్వం హిందువుల విశ్వాసాలను పరిహసించే ఏకైక లక్ష్యంతో ఆలయ ప్రవేశానికి నిజమైన మహిళా భక్తులెవరూ ముందుకు రాకపోయినా నాస్తిక వాద భావజాలం కలిగిన కమ్యునిస్టు కార్యకర్తలను, మావోఇస్టు సానుభూతిపరులను, ముస్లిములను, క్రైస్తవులను ఇలా అనేక మందిని వివిధ సందర్భాలలో ఆలయ ప్రవేశం చేయించడానికి విఫల యత్నం చేసిందని చెప్పారు. చివరికి దొంగచాటుగా మావోఇస్టు సానుభూతి పరులైన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలను ఆలయ ప్రవేశం చేయించి ఘనంగా ప్రకటించిందని దుయ్యబట్టారు. శాంతియుత పద్దతిలో నిరసన తెలుపుతున్న లక్షలాది అయ్యప్ప భక్తులపై కేరళలోని కమ్యునిస్టు గూండాలు హేయమైన రీతిలో దాడులు జరుపుతున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

అయ్యప్ప ధర్మ శాస్త నిర్వాహకులు శ్రీ వేణు, మణికంఠ సేవా సమాజ నిర్వాహకులు శ్రీ బాజిల్ గురు స్వామి, శరత్ గురుస్వామి, ఆంధ్రా మెడికల్స్ నిర్వాహకులు శ్రీ వాసు తదితరులు మాట్లాడుతూ కేరళలోని మార్క్సిస్టు పార్టీ మరియు తీవ్రవాద గ్రూపుల మధ్య సంబంధాలు శబరిమలలో భక్తుల ఆందోళనల సమయంలో భక్తులపై జరిగిన దాడుల నేపధ్యంలో బహిర్గతమయ్యాయని, వీటిపై ఎన్.ఐ.ఏ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తీవ్రవాదులతో సంబంధాలుండి, నేర పూరిత నేపధ్యం వున్న యువతులకు దేవాలయ ప్రవేశం కల్పించడం వెనుక కుట్ర వున్నదేమోనని సందేహం వెలిబుచ్చారు. కేరళ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి వున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, మానవ హక్కులను సంరక్షించాలని కోరారు. ఈ నెల 22 న సుప్రీమ్ కోర్టు ముందుకు రివ్యూ పిటిషన్ రానున్న తరుణంలో భక్తుల విశ్వాసాలను పరిగణనలోనికి తీసుకోవలసినదిగా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం అయ్యప్ప భక్తులెల్లరు ర్యాలీగా కలెక్టరాఫీసుకు వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.