News

అమరవీరుడు సాయితేజకు అంతిమ వీడ్కోలు… స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు

649views

మిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. కురబలకోట మనదలంలోని సాయితేజ స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

ఈ ఉదయం బెంగళూరులో సైన్యానికి చెందిన కమాండ్‌ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్‌ వలసపల్లి మీదుగా ఎగువరేగడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. సుమారు 30 కి.మీ మేర సాగిన ఈ భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పతాకాలతో ర్యాలీ కొనసాగించారు.

ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న సాయితేజ పార్థివదేహాన్ని చూసి భార్య శ్యామల, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎగువరేగడ మైదానంలో ఉంచిన సాయితేజ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ‘సాయితేజ అమర్‌ రహే’ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అనంతరం సాయితేజ వ్యవసాయక్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.