
న్యూఢిల్లీ: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఆమోదం తెలిపాయి. ఉదయం లోక్‌సభలో, మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదమే మిగిలింది.
కాంగ్రెస్ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నుంచి బయటికి వచ్చి, తమ తమ స్థానాల్లో కూర్చుంటే చర్చకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభ కార్యకలాపాలు సజావుగా జరగడానికి వీలుగా సభ్యులు సహకరించాలని కోరారు.
చివరికి ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య, మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. పార్లమెంట్‌లో తొలి రోజే రభస మొదలైంది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
-
దేశ ప్రగతికోసం చర్చ జరగాలి
దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
Source: Nijamtoday





