
491views
తిరుపతి: తితిదే ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలకు ఉపయోగించిన పుష్పాలతో సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో చేపట్టిన అగరబత్తీలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆలయాల్లో పూజలు, అలంకరణలకు వినియోగించే పుష్పాలు వృథా కాకుండా బెంగుళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో తితిదే అగరబత్తుల తయారీ చేపట్టింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోశాలలో పది యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు వినియోగించిన పుష్పాలతో చేపట్టిన అగరబత్తీలను లాభాపేక్ష లేకుండా ఉత్పత్తి వ్యయానికే విక్రయిస్తున్నారు. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, తుష్టి, దివ్యసృష్టి, దివ్యదృష్టి పేర్లతో ఏడు రకాల అగరబత్తీలను ఉత్పత్తి చేస్తున్నారు.





