News

జ‌మ్మూ క‌శ్మీర్‌లో 23, 24 తేదీల్లో అమిత్‌షా పర్యట‌న‌

620views

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో అమిత్‌షా పర్యటించనుండటం ఇదే మొదటిసారి. కొద్దిరోజులుగా స్థానికేతర కార్మికులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న ఘటనలు కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఇంతవరకూ 11 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపగా, వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాద ఏరివేత చర్యలను భద్రతా దళాలు తీవ్రం చేశాయి. డజనుకు పైగా ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. అమిత్‌షా సైతం కశ్మీర్‌లో ఉగ్రఘాతుకాలతో సహా వివిధ భద్రతా అంశాలపై సోమవారం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల చీఫ్‌లతో చర్చించారు.

ఆరుగురు ఉగ్రవాదులు హ‌తం

ఇలా ఉండగా, భారత సైన్యం జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాజౌరీ సెక్టార్‌లోని దట్టమైన అడవులలో భారత సైన్యం జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ లష్కరే ఇ – తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు నలుగురు ఉగ్రవాదులు అడవుల్లోనే చిక్కుకుపోయారు. కాగా, గత రెండు మూడు నెలల్లోనే పాకిస్తాన్‌ నుండి రాజౌరి – పూంచ్‌ జిల్లా సరిహద్దుల మధ్య అడవులవైపు తొమ్మిది నుండి పది మంది వరకు ఉగ్రవాదులు చొరబడ్డారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి