
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న కశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని, కేవలం చర్చలతోనే ఈ వివాదం సద్దుమణుగుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంటున్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ కూడా ఇలాగే భావించారని ఇమ్రాన్ అన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలిస్తే సమస్య పరిష్కారమవుతుందని అప్పట్లో వాజ్‌పేయీ తనతో చెప్పారన్నారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘కశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు మార్గాలున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య భేటీ జరిగేంతవరకు అవి చర్చకు రావు. గతంలో ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ, ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి నత్వార్ సింగ్‌ను కలిశాను. 2004 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓడిపోకపోతే కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేదని వాజ్‌పేయీ నాతో అన్నారు. దీన్ని బట్టి కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా రెండు దేశాలు దాదాపు దగ్గరకొచ్చాయని అర్థమవుతోంది’ అని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు.
పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను పెంపొందించుకునేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఇమ్రాన్ తెలిపారు. అయితే భారత్‌లో త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాక్‌తో చర్చలకు ఆ దేశం సిద్ధంగా లేదని అన్నారు.
source : 4/12/2018, మంగళవారం ఈనాడు, దినపత్రిక.





