News

భయంకరమైన వామపక్ష తీవ్రవాది మోతీరామ్‌ అరెస్టు

610views

బీజాపూర్‌: మావోయిస్టుల అత్యంత శక్తివంతమైన బెటాలియన్‌లలో ఒకటైన పిఎల్‌జిఎ-1 సభ్యుడు, భయంకరమైన వామపక్ష తీవ్రవాది మోతిరామ్‌ను భద్రతా దళాలు బీజాపూర్‌లో అరెస్టు చేశాయి. అందిన సమాచారం మేరకు ఆదివారం (సెప్టెంబర్‌ 12), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌), జిల్లా పోలీసుల సంయుక్త బృందం బీజాపూర్‌ జిల్లాలోని పటేల్‌పర, గోల్గుండ గ్రామాల మధ్య మోతి రామ్‌ను పట్టుకున్నాయి.

2010లో భద్రతా సిబ్బందిపై భయంకర దాడి

వామపక్ష తీవ్రవాది మోతిరామ్‌, అతని సహచరులు 2010లో తాడ్మెట్ల గ్రామ సమీపంలో భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో డెబ్భై ఆరు మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. ఇది కాకుండా, 2017 బుర్కపాల్‌ నక్సలైట్‌ దాడిలో అతని ప్రమేయానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇందులో 25 మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది అమరులయ్యారు. బీజాపూర్‌ జిల్లాలోని నైమెద్‌ ప్రాంతానికి చెందిన మోతిరామ్‌ బస్తర్‌ డివిజన్‌ దక్షిణ ప్రాంతంలో అనేక భారీ దాడులకు పాల్పడ్డాడు. భద్రతా సంస్థలు అతని అరెస్టును పెద్ద విజయంగా భావిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం దాదాపు 11 ఏళ్ళుగా గాలిస్తోంది. మోతిరామ్‌ తలకు ఎనిమిది లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది.

అనేక మావోయిస్టు తీవ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే మోతిరామ్‌, మావోయిస్ట్‌ మదవి హిద్మతో కలిసి పనిచేశాడు. మోతీరామ్‌ సభ్యుడిగా ఉన్న పీఎల్‌జిఎ బెటాలియన్‌ నంబర్‌ వన్‌ మడవి హిడ్మా నేతృత్వంలో పనిచేస్తుంది. అతని అరెస్టుతో, ఇటీవల బీజాపూర్‌ దాడి ప్రధాన కుట్రదారుడు మాడవి హిడ్మా ఆచూకీ గురించి సమాచారాన్ని కూడా సేకరించవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి.

ఒడిశాలో మరొకరి అరెస్టు

ఏఓబీలోని కొరాపుట్‌, మల్కాన్‌గిరి, విశాఖపట్నం జిల్లాల్లో మావోయిస్టు కీలకనేత దుబాసి శంకర్‌ అలియాస్‌ మహేందర్‌ అలియాస్‌ అరుణ్‌ అలియాస్‌ రమేష్‌ను ఒడిశాలో అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర డీజీపీ అభయ్‌ తెలిపారు. ‘కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పేటగడ అటవీ ప్రాంతంలో ఎస్‌ఓజీ, జిల్లా వాలంటరీ దళం, బీఎస్‌ఎఫ్‌, రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌ చేసి.. నోయరో గ్రామంలో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఇన్సాస్‌ రైఫిల్‌, 10 రౌండ్ల బుల్లెట్లు, ఇతర సామగ్రి, రూ.35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆచూకీ చెప్పినవారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని గతంలో ప్రకటించాం.’ అని ఒడిశా డీజీపీ అభయ్‌ తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి