
వారణాసి: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఈ ఏడాది హిందూ రక్షణ అధ్యయనాలపై కొత్తగా ఎంఏ కోర్సు ప్రవేశపెట్టింది. ఇటువంటి కోర్సు పెట్టడడం భారతదేశంలోనే ఇదే మొదటిసారి. యూనివర్సిటీలోని భారత అధ్యయన కేంద్రం(బీఏకే) విభాగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. హిందూస్తాన్ టైమ్స్‌లోని సమాచారం ప్రకారం… కోర్సులో భారతదేశంలోని ప్రాచీన గ్రంథాలలోని ప్రాచీన యుద్ధానికి సంబంధించిన అంశాలను చేర్చారు. మహిళా సైనికుల పాత్ర, సైనిక వ్యూహం, శిబిరాల ఏర్పాటు, సైనిక చర్చలు వంటివి ఆ పాఠ్యాంశంలో పొందుపరిచారు.
వేద సాహిత్యంలోని ‘రక్షణ అధ్యయనాల’ సూచనలను వెలికితీసేందుకు, ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి, మిలిటరీ ఆలోచనను ప్రవేశపెట్టడం… ఈ అంశాల లక్ష్యమని యూనివర్సిటీలోని అధికారులు వివరించారని ఆ పత్రికలోని కథనం పేర్కొన్నది. ‘ఇండియన్ మిలిటరీ, సైన్స్ అండ్ స్ట్రాటజీ’ పేరిట ఒక పేపర్ కింద నాలుగు యూనిట్లు ఉన్నాయి. కింద అంశాలను ఆ నాలుగు యూనిట్లలో పొందుపరిచారు.
- శత్రువులు, మిత్రుల నిర్వచనాలు
- శత్రువులను తగ్గించడానికి, మిత్రులను ప్రోత్సహించడానికి మార్గాలు
- సైన్యంలో మహిళల ఆలోచన
- శిబిరం, కోట నిర్మాణం
- యుద్ధానికి సరైన సమయం, ప్రదేశం
- యుద్ధ వ్యూహం తయారీ, దాని అమలు
- విజయం, ఓటమి తరువాత వ్యూహం…
యూనివర్సిటీలోని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ… ‘వేద సాహిత్యంలో సైనిక విజ్ఞానాలు, సైనిక వ్యూహాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. అవి ఇప్పటి వరకు సంపూర్ణంగా వెలుగులోకి రాలేదు. విద్యార్థులు పాఠ్యాంశాల ద్వారా హిందూ సైనిక శాస్త్రం, వ్యూహాన్ని అధ్యయనం చేయడం అవసరం. ఈ కోర్సులో విద్యార్థులు రెండు ముఖ్యమైన పుస్తకాలను అధ్యయనం చేస్తారన్నారు. అవి… వసిష్ఠ ‘ధనుర్వేద సంహిత’, వైశంపాయన్ ‘నీతి ప్రకాశిక’. ఈ రెండు సంస్కృతంలో ఉంటాయి… ఇవి ప్రత్యేకంగా సైనిక వ్యూహాలను వివరిస్తాయి. అయితే, వీటి గురించి ఎవరికీ తెలియదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా వంటి దేశాలు పురాతన సైనిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయని ఆ అధికారి వెల్లడించారు.
కాగా, భారతదేశంలోని పురాతన గ్రంథాలు జాతీయ భద్రత కోసం వ్యూహాల ఏర్పాటు, బాహ్య, అంతర్గత శత్రువులతో ఎలా వ్యవహరించాలనే దానిపై కీలకమైన సమాచారాన్ని కలిగి ఉన్నాయి. అనేక భారతీయ గ్రంథాలు యుద్ధం, రాజకీయాలు, జాతీయ వ్యూహం, పరిపాలన వంటివాటిపై సమగ్రంగా తెలుపుతుండడం విశేషం.
ఈ కోర్సు బీహెచ్‌యూ ఫిలాసఫీ అండ్ రిలిజియన్ విభాగం, భారత అధ్యయన కేంద్రం, సంస్కృత విభాగం, ప్రాచీన చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాఖ సంయుక్త ప్రయత్నం వల్ల ఆవిర్భవించింది.
మిలటరీలో మహిళలు
హిందుస్తాన్ టైమ్స్ సమాచారం మేరకు.. మిలిటరీలో మహిళలు పోషించిన పాత్రను ఆ అధికారి మరింత నొక్కిచెప్పారు. ‘మిలటరీలో మహిళల భాగస్వామ్యంపై మాకు గొప్ప చరిత్ర ఉంది. ఉదాహరణకు… రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి. ఇద్దరూ యుద్ధభూమిలో పోరాడారు. ప్రస్తుతం, మహిళలు మా రక్షణ సేవలలో భాగం. మిలిటరీలో మహిళల భావన మూలాన్ని విద్యార్థులు తెలుసుకోవాలి’ అని ఆ అధికారి చెప్పారు.
‘ఆసక్తికరంగా, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హిందువులు, వారి నాగరికత గురించి మరింత తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. అధిక సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు తమ మూలాలతో కనెక్ట్ అయ్యేందుకు, మరింత జ్ఞానాన్ని పొందడానికి ఆసక్తి కలిగి ఉన్నారు’ అని ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ విజయ్ బహదూర్ సింగ్ పేర్కొన్నారు.
ఈ సంవత్సరం మొదటి బ్యాచ్‌లో 40 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారు. రెండేళ్ళ ఎంఏ కోర్సులో తొమ్మిది తప్పనిసరి, ఏడు ఐచ్ఛిక పత్రాలు ఉంటాయి.
సైనిక శాస్త్రం, తత్వశాస్త్రం, జ్ఞానశాస్త్రం వంటి హిందూ మత గ్రంథాలలోని వివిధ రంగాలకు అకడమిక్ ఫార్మాట్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చును. సిలబస్‌లో హిందూ మతం సాంప్రదాయం ఉంది. ఇందులో ప్రధానంగా సూత్రాలు, వ్యాఖ్యానాలు, చర్చలు, గ్రంథాల అర్థాన్ని నిర్ణయించే పద్ధతులు. పాశ్చాత్య జ్ఞానం, రామాయణం, మహాభారతం, వాస్తుశిల్పం, జానపద, జానపద-నాటకం, భాషాశాస్త్రం, ప్రాచీన సైనిక శాస్త్రం ఉన్నాయి.
Source: Opindia





