
షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకాల ప్రయోజనాలేవీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు విస్తరించ డానికి వీల్లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారశాఖ సహాయ మంత్రి ఎ. నారాయణస్వామి వెల్లడించారు. ఎస్సీల సంక్షేమం కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకాలను ఎస్సీల నుంచి క్రైస్తవంలోకి మారిన వారికి వర్తింపజేయొచ్చా? 1977 ఆగస్టు 30న జారీ చేసిన 341 జీవో ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర పథకాలను మతం మారిన ఎస్సీలకు కూడా వర్తింపజేస్తున్న విషయం కేంద్రానికి తెలుసా? అని ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ‘ఎస్సీలకు ఉద్దేశించిన పథకాలేవీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు విస్తరించడానికి వీల్లేదు. అయితే రాష్ట్ర సంక్షేమ శాఖ జారీ చేసిన 341 జీవో ద్వారా వర్తింపజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం 2021 జులై 30న రాసిన లేఖలో పేర్కొంది. ఈ నిబంధనలు కేంద్ర ప్రాయోజిత పథకాలకుగానీ, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాలకుగానీ వర్తించవు కాబట్టి కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు’ అని చెప్పారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉంది
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి ఎ. నారాయణస్వామి పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అధ్యయనం కోసం జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలో ఏర్పాటైన జాతీయ కమిషన్ 2008 మే 1న నివేదిక ఇచ్చింది. ఈ రిజర్వేషన్లను వర్గీకరించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని సవరించాలని సిఫార్సు చేసింది. దీనిపై త్వరగా అభిప్రాయాలను చెప్పాలని రాష్ట్రాలకు 2019 డిసెంబరు 9న లేఖలు రాశాం’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.





