అతి తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యాన్ని అందిస్తున్న జయభారత్ హాస్పిటల్ సేవలు అభినందనీయం – రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్

అతి తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యాన్ని అందిస్తున్న జయభారత్ హాస్పిటల్ సేవలు అభినందనీయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరులో సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న జయభారత్ హాస్పిటల్ నందు నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జయభారత్ హాస్పిటల్ సేవా నిరతిని కొనియాడారు. నెల్లూరులోని స్వయంసేవకుల సంకల్పబలం వల్ల కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత లేకుండా కోవిడ్ రోగులను రక్షించుకోగలిగామన్నారు. జయభారత్ హాస్పిటల్ గొప్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఎదగాలనే ఆకాంక్షను మంత్రి వ్యక్తం చేశారు. కోవిడ్ సంక్షోభ సమయంలో జయభారత్ హాస్పిటల్ వైద్యులు పేద ప్రజలకు విశేషమైన సేవలందించారని,అలాగే పేదలకు అతి తక్కువ ఖర్చుతో డయాలసిస్ ను అందిస్తున్న ఘనత జయభారత్ హాస్పిటల్ కే దక్కుతుందని శ్రీ అనిల్ యాదవ్ ప్రశంసించారు.

ఆర్ ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచారక్ శ్రీ ఆదిత్య మాట్లాడుతూ దాతల సహాయంతో పేదలకు అన్ని విభాగాల వైద్యాన్ని అందించాలన్నారు. విశాలమైన ప్రాంగణంలో జయభారత్ హాస్పిటల్ మరో శాఖను నిర్మించుకోవడానికి దాతలు సహకరించాలన్నారు. దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సుమారు పదివేల సేవా కార్యక్రమాలను నిత్యం కొనసాగిస్తున్నదని తెలియజేశారు.
నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ గుడిసెలో ప్రారంభమైన జయభారత్ హాస్పిటల్ ఎంతోమంది కృషితో నేడు 150 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ దాతలు డిపి గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ దిలీప్ కుమార్ జైన్, చిన్మయ మిషన్ చెన్నై సెక్రటరీ శ్రీ హరి శ్యాం, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సింహపురి వైద్య సేవా సమితి వైస్ చైర్మన్ శ్రీ బాలు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి శ్రీ హరికుమార్ రెడ్డి, సభ్యులు డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం, శ్రీ గుర్రం సుధాకర్, హాస్పిటల్ జనరల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





