News

“దొంగిలించిన” కళాఖండాలను భారత్ కు తిరిగివ్వనున్న ఆస్ట్రేలియా

533views

భారతదేశానికి తిరిగి రావలసిన కళాఖండాలను ఆస్ట్రేలియా గ్యాలరీ గుర్తించింది – ఇందులో శిల్పాలు, ఛాయాచిత్రాల వంటి కళాఖండాలున్నాయి. ఇవన్నీ భారత్ నుంచి దొంగిలించబడినవి, దోచుకొచ్చినవి లేదా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియనివి.

ప్రస్తుతానికి ఆస్ట్రేలియా భారతదేశానికి 14 కళాకృతులను తిరిగి ఇవ్వనుంది. వీటిలో కనీసం ఆరు దొంగిలించబడినవి లేదా చట్టవిరుద్ధంగా ఎగుమతి చేయబడ్డాయని భావిస్తున్నారు.

ఈ కళాకృతులన్నీ ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో ఉన్న గ్యాలరీలో ఉన్నాయి. అవన్నీ12 వ శతాబ్దానికి చెందినవిగా నిపుణులు భావిస్తున్నారు. వాటి ప్రస్తుత విలువ 2.2 మిలియన్లుగా నిర్ధారించారు. అవన్నీ “మతపరమైన మరియు సాంస్కృతిక కళాఖండాలు” అని గ్యాలరీ వర్గాలు వెల్లడించాయి.

ఆ కళాకృతులను భారత ప్రభుత్వానికి కొన్ని నెలల్లో తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్యాలరీ డైరెక్టర్ నిక్ మిట్జెవిచ్ చెప్పారు.
“అవన్నీ భారత్ కు తిరిగి రావడం ఒక ఉపశమనం. దీంతో చరిత్రలోని ఒక కఠినమైన అధ్యాయం ముగిసినట్లుగా భావించవచ్చు” అని నిక్ చెప్పుకొచ్చారు.

“ఆపరేషన్ హిడెన్ ఐడల్” పేరుతో యుఎస్ ఫెడరల్ ఈ అంశాన్ని లోతుగా విచారిస్తోంది. దీనికి సంబంధించి మాజీ మాన్హాటన్ కళాఖండాల డీలర్ మరియు అక్రమ రవాణాదారుడు సుభాష్ కపూర్ పై ఆరోపణలున్నాయి. ఆస్ట్రేలియా నుంచి భారత్ కు రానున్న 14 కళాకృతులలో 13 కళాకృతులు సుభాష్ కపూర్ ద్వారానే, అక్రమ మార్గాలలో ఎగుమతి అయినట్లుగా ఆరోపణలున్నాయి. కానీ కపూర్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు.

నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా ఇప్పటికే కపూర్ ద్వారా తమకు అందిన అనేక ఇతర కళాఖండాలను భారత్ కు తిరిగిచ్చింది. ఇందులో 5 మిలియన్ US డాలర్ల విలువైన కాంస్య విగ్రహం ఉంది. ఇందులో తమిళనాడు ఆలయం నుండి దొంగిలించబడిన శివుని ప్రతిమ.

ఇందులో చట్టపరమైన, నైతిక అంశాలను పరిగణనలోనికి తీసుకుని తాము తగిన మార్గదర్శకాలను రూపొందించామని, ఈ క్రమంలో ఆసియా నుంచి వచ్చిన మరో మూడు కళాఖండాలను కూడా తాము పరిశీలిస్తున్నట్టు మిట్జెవిచ్ పేర్కొన్నారు.

హిందూ దేశంలో 11 వ మరియు 12 వ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడులో చోళ రాజవంశ పాలనలో కళలకు పెద్దపీట వేయబడింది. నాటి పురాతన వస్తువులను కపూర్ సేకరించి అక్రమ మార్గాలలో విదేశాలకు చేరవేసినట్లుగా సమాచారం. 2011 లో అతన్ని అరెస్టు చేసినప్పటి నుండి, యునైటెడ్ స్టేట్స్ (US) కూడా వందలాది కళాఖండాలను భారత్ కు తిరిగి ఇచ్చింది.

ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం భారత్ తో స్నేహానికి ప్రతీక – ఆస్ట్రేలియాలోని భారత హైకమిషనర్

ఆస్ట్రేలియాలోని భారత హైకమిషనర్ మన్‌ప్రీత్ వోహ్రా అపురూప కళా ఖండాలను తిరిగి భారతదేశానికి అప్పగించాలని ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం భారత్ తో స్నేహానికి ప్రతీక అని.. ఇందుకు భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతుందని వోహ్రా అన్నారు. ఇవి అత్యుత్తమమైనవని, భారత్ కు చేరుకున్న తర్వాత ప్రభుత్వం, భారత ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని వోహ్రా చెప్పుకొచ్చారు.

Source : NDTV

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.