
వారెవ్వా..! ఆమె సాధించింది. మీరాబాయి చాను గెలిచింది.. ముందుగా చెప్పినట్టే టోక్యో ఒలింపిక్స్ లో పతకం ముద్దాడింది. భూమ్మీద జరిగే అత్యున్నత క్రీడల్లో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో ఆమె రజతం ఎత్తేసింది. ఈ మణిపుర్ మణిపూస భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడించింది.
మల్లీశ్వరి తర్వాత..
వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది మీరాబాయి చాను. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేసింది. చిరస్థాయిగా నిలిచే ఘనత అందుకుంది.
క్లీన్ అండ్ జర్క్ లో తిరుగులేదు
ఈ పోటీల్లో మీరాబాయికి గట్టి పోటీనిచ్చింది చైనా వెయిట్ లిఫ్టర్ హూ జిహూయి. మొత్తంగా 210 కిలోలు ఎత్తి స్వర్ణం అందుకుంది. అయితే పోటీ జరిగినంత సేపూ మీరాబాయి అత్యంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. తనకు పతకం ఖాయమన్న ధీమాతోనే ఆడింది. స్నాచ్‌లో మొదటి అవకాశంలో 84 కిలోలు ఎత్తిన ఆమె.. రెండోసారి 87 కిలోలు ఎత్తింది. అంతకన్నా ఎక్కువ ఎత్తాలన్న ఉద్దేశంతో మూడోసారి 89 కిలోలు ప్రయత్నించి విఫలమైంది.
115 కిలోలు ఎత్తి ఖాయం చేసేసింది
ఇక క్లీన్ అండ్ జర్క్‌లో అద్భుతమే చేసింది. ఎందుకంటే ఈ విభాగంలో మీరాకు ప్రపంచంలోనే తిరుగులేదు! మొదట 110 కిలోలను అలవోకగా ఎత్తింది. అయితే కాంస్యం గెలిచిన విండీ కాంటిక క్లీన్ అండ్ జర్క్‌లో ఎత్తిన అత్యధిక బరువు 110 మాత్రమే. దాంతో మీరాకు పతకం ఖాయమని అర్థమైపోయింది. రెండో అవకాశంలో 115 కిలోలు ఎత్తి రజతం ఖాయం చేసుకుంది. స్వర్ణం రాదని తెలిసినా.. మెరుగైన రికార్డు కోసం 117 కిలోలు ప్రయత్నించి విఫలమైంది. మొత్తంగా 202 కిలోలతో భారత్‌కు పతకం అందించింది. పతక ఈవెంట్లు ఉన్న తొలిరోజే రజతం ముద్దాడి.. భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపింది.
రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చానుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్‌మీడియా వేదికగా చానుపై ప్రశంసలు కురిపించారు.
* టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాభాయి చానుకు హృదయపూర్వక అభినందనలు – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
* టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం – ప్రధాని మోడీ






