
మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు చుక్కెదురైంది. ఆయనకు సంబంధించిన దాదాపు రూ.4కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై నమోదైన కేసు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఈడీ పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో బార్లు, రెస్టారెంట్ల నుంచి అక్రమ వసూళ్లతోపాటు పోలీసుశాఖలో బదిల్లీలోనూ అనిల్ దేశ్‌ముఖ్ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. విచారణకు సంబంధించి ఆయనకు ఈడీ పలుసార్లు నోటీసులు కూడా పంపించింది. ఆయనతో పాటు కుమారుడు హృషికేశ్, భార్యకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ వారు ఎవరూ ఈడీ నోటీసులకు స్పందించలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఈడీ.. తాజాగా రూ.4కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు వెల్లడించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ ఖండిస్తున్నారు. తనపై ఈడీ అన్యాయంగా చర్యలు చేపడుతోందని వాదిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.
మరోవైపు ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. పోలీసు అధికారుల బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పరంబీర్ సింగ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం అనిల్ దేశ్‌ముఖ్‌తో పాలు పలువురు అధికారుల్ని విచారించింది.





