
మద్రాసు హైకోర్టు ప్రముఖ తమిళ హీరో విజయ్ ( జోసెఫ్ విజయ్) వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగాను ఆయనకు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఆయనను నిజమైన హీరోలా ప్రవర్తించమంటూ హితవు పలికింది.
హీరో జోసెఫ్ విజయ్ కొంతకాలం క్రితం ఇంగ్లండు నుంచి అత్యంత ఖరీదైన, విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకున్నారు. అందుకై భారత ప్రభుత్వానికి చెల్లించవలసిన దిగుమతి సుంకం నుంచి తనకు మినహాయింపునివ్వవలసినదిగా కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో విజయ్ పిటిషన్ను విన్న న్యాయమూర్తి జస్టిస్ SM సుబ్రమణియన్ హీరో గారి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల్లోగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నును చెల్లించడంతో పాటుగా, అదనంగా మరో లక్ష రూపాయల జరిమానాను కూడా తమిళనాడు ముఖ్యమంత్రి కోవిడ్ సహాయనిధికి చెల్లించవలసినదిగా న్యాయమూర్తి హీరో విజయ్ ని ఆదేశించారు.
” పిటిషనర్ ప్రఖ్యాత నటుడు. అసలు ఆయన క్రమం తప్పకుండా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది.” అని కోర్టు అభిప్రాయపడింది.
” తమిళనాడు రాష్ట్రంలో సినీ హీరోలు ఎందరో పాలకులుగా కూడా ఎదిగారు. ప్రజలు వారు “రియల్ హీరో” లనే భావనలో ఉన్నారు. అలాంటిది, వారు ఇలా కేవలం “రీల్ హీరోలు” గా ప్రవర్తిస్తారని వారు ఊహించలేరు. పన్నులు ఎగవేయడం ఒక జాతి వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధం చర్య, అలవాటు, మనస్తత్వం” అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
సినిమాలలో అవినీతి అంతు చూసే పోరాట యోధులుగా కనిపించే హీరోలు నిజ జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను ఎగవేసే తున్నారని, అందుకు తాము చట్టానికి అతీతులమనే భావనలో వారు ఉన్నారని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
” నటుడు విజయ్ ది బాధ్యతారహిత చర్య. దీంతో ఆయన తన సినిమాలు చూడడానికి డబ్బులు చెల్లించిన అభిమానులను కూడా అవమానించినట్లు అయింది. తాము సంపాదించిన డబ్బు పేదల కష్టార్జితమనే విషయాన్ని మన దేశంలోని ప్రముఖులందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది.” అని ఈ కేసు తీర్పును వెల్లడించే సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు.
“హీరో విజయ్ లా పిటిషన్లు వేసేవారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వారందరూ న్యాయంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను తప్పనిసరిగా, నిజాయితీగా చెల్లించాలి. సమాజంలోని అంతరాలు, అసమానతలు తొలగిపోయి అందరూ సమానంగా జీవించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సామాజిక న్యాయం సాధించేందుకు వారంతా సహకరించాలి.” అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
Source : OPINDIA





