
తూర్పు లడ్డాఖ్ లో భారత్, చైనాల మధ్య ఏడాదిగా సైనిక ప్రతిష్టంభన నెలకొంది. ఘర్షణల కారణంగా రెండువైపులా ప్రాణనష్టం సంభవించింది. తీవ్ర చర్చల తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయి. మిగతా ప్రాంతాల్లో ఉపసంహరణపై చర్చలు జరిగినా.. ముందడుగు పడలేదు. ఈ క్రమంలో సంయమనం పాటించడానికి బదులు రెచ్చగొట్టే చర్యలకు చైనా దిగింది. భారత సరిహద్దులకు చేరువలో 20కిపైగా ఫైటర్ జెట్‌లతో ఇటీవల భారీ వైమానిక విన్యాసాలు చేపట్టింది. ఇందులో జె-11, జె-16 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. గతేడాది భారత్‌తో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సమయంలో తమ సైన్యానికి మద్దతుగా వైమానిక కార్యకలాపాలు సాగించిన స్థావరాల కేంద్రంగానే తాజా విన్యాసాలు జరిగాయి. అందువల్ల ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కష్గర్, హోటాన్, ఎంగారి గున్సా, షిగాట్సే, లాసా గోంగ్కర్, నియంగిచి, చాండో పాంట్గా నుంచి ఈ విన్యాసాలు సాగాయి. ఆ సమయంలో చైనా జెట్‌లు హద్దులు దాటలేదని భారత వర్గాలు పేర్కొన్నాయి.
చైనా వైమానిక దళం ఇటీవల ఈ స్థావరాలను ఆధునీకరించింది. యుద్ధవిమానాలను భద్రపరిచేందుకు వీలుగా బాంబులను తట్టుకునేలా కాంక్రీట్ షెల్టర్లు నిర్మించింది. రన్‌వేల నిడివిని పొడిగించడం, అదనంగా మానవ వనరులను మోహరించడం వంటివి కూడా చేపట్టింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా పాంగాంగ్ సరస్సు వంటి ప్రాంతాల నుంచి తమ సైనికులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ, హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను అలాగే ఉంచింది.
అప్రమత్తంగా భారత్…
చైనా సైనిక కార్యకలాపాలను ఉపగ్రహాలు, ఇతర ఆధునిక నిఘా వ్యవస్థలతో భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. చైనాలోని షింజియాంగ్, టిబెట్ స్వయంప్రతిపత్తి సైనిక ప్రాంతంలోని ఏడు డ్రాగన్ సైనిక స్థావరాలపై కన్నేసి ఉంచింది. అధునాతన రఫేల్ సహా ఈ ప్రాంతంలో మోహరించిన యుద్ధవిమాన స్క్వాడ్రన్లను అప్రమత్తం చేసింది. అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను కలిగి ఉండాలని వాటిని ఆదేశించింది. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేలా అవసరమైన సాధన సంపత్తితో సరిహద్దుల్లోని మన సైనిక దళాలు సన్నద్ధంగా ఉన్నాయని అధికారవర్గాలు తెలిపారు. నిజానికి గత ఏడాది నుంచి తూర్పు లద్దాఖ్‌లో మన వైమానిక దళ కార్యకలాపాలు బాగా పెరిగాయి.





