
డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 1891లో 13 ఏప్రిల్ రాత్రి 12.05 గం.లకు మధ్య ప్రదేశ్,ఇండోర్ జిల్లా మాహు మిలటరీ కంటోన్మెంట్ ప్రాంతంలో జన్నించారు. వారి తల్లి, తండ్రులు భీమా బాయి, రాంజీ సక్పాల్. రాంజీ శక్పాల్ మిలటరీలో సుబెదార్ గా పనిచేశారు.
1978 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 న భీమరావు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షకు పైగా దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 13 రాత్రి 12.05 వరకు డా అంబేడ్కర్ పై పాటలు పాడారు. సరిగ్గా గం. 12.05 లకు సమతా సైనికులు మూడు సార్లు ‘జై భీం’ అంటూ భీమ వందనం చేశారు. అనంతరం స్మారక సమితి అధ్యక్షులు శ్రీ బంతే ఆచార్య సుమెధ బోధి గౌరవ వందనం, బుద్ధ వందనం సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక రాష్ట్ర మంత్రి శ్రిమతి ఉషా ఠాగూర్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్రీ K. శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మ స్థల చరిత్ర:
1968లో భంతే దర్మశీల్ బ్రిటిష్ మిలటరీ రికార్డులను శోధించి భీమ రావు జన్మ స్థలాన్ని గుర్తించారు.అక్కడ డా.అంబెడ్కర్ జన్మ స్థల స్మారక మందిరం నిర్మాణం కావాలని అందరూ కోరుకున్నారు. శ్రీ సుందర్ లాల్ పట్వా (బి జె.పి.) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డా.అంబెడ్కర్ జన్మస్థల పనులు ప్రారంభం అయ్యాయి. మాహూ మిలటరీ పరిధిలో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు జన్మ స్థల స్మారకం కోసం 22,500 చ. అడుగుల స్థలాన్ని కేటాయించింది. రాష్ట్రంలో శ్రీ దిగ్విజయ్ సింగ్ ( కాంగ్రెస్) ప్రభుత్వం హయాంలో పనులు ఆగి పోయాయి. తిరిగి ఉమా భారతి ముఖ్యమంత్రి అయిన తరువాత జన్మ స్థల పనులు తిరిగి ప్రారంభం అయ్యాయి. శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేటి డా.అంబెడ్కర్ జన్మ స్థల స్మారకం నిర్మాణం పూర్తి అయింది. 14 ఏప్రిల్ 2008లో ఆ నాటి కేంద్ర హోం మంత్రి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ ఈ స్మారకాన్ని ప్రజలకు సమర్పించారు. ఈ స్మారక మందిరం నిర్వహణ కోసం డా. బాబా సాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఏర్పడింది. ఈ సొసైటీకి మొదటి అధ్యక్షులుగా శ్రీ భంతె ధర్మశీల్, అనంతరం శ్రీ భాంతే సంఘ శీల్ పనిచేశారు. నేడు భంతీ ఆచార్య సుమేద బోధి అధ్యక్షులుగా, రాజేష్ వాంఖడే కార్యదర్శిగా కమిటీ ఏర్పడింది. ఈ స్మారక మందిరంలో డా.అంబెడ్కర్ జీవన చిత్ర ప్రదర్శిని, బుద్ధుని విగ్రహంతో ధ్యాన మందిరం, సాహిత్య పుస్తక విక్రయశాల ఉన్నాయి. ప్రతి సంవత్సరం బుద్ధ జయంతి, సంత్ కబీర్ దాస్ జయంతి, మహాత్మా జ్యోతి బా ఫూలే జయంతి, డా.అంబేద్కర్ జయంతి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. డా.అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశం నలుమూలల నుండి లక్ష మంది అనుచరులు వస్తారు. దగ్గరలో డా.అంబెడ్కర్ విశ్వ విద్యాలయం ఉన్నది. మాహు నగరాన్ని అంబేడ్కర్ నగరంగా రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది.
సామాజిక సమతకు ఉద్యమించిన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మ స్థల స్మారకాన్ని ప్రజలందరూ దర్శించాలి. ఈ స్మారకం సామాజిక సమతా సాధనలో ఒక ప్రేరణా కేంద్రం అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.





