ArticlesNews

అనురాగమయి జిల్లేళ్ళముడి అమ్మ

2.2kviews

1923 మార్చి 28న  గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు అనసూయ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అనసూయ, తన బందువర్గమంతా బాధలో ఉండగా “అందరినీ ఏడవ వద్దని.. అమ్మ దేవుడి దగ్గరకే వెళ్లిందని” ఓదార్చి అందరిని ఆశ్చర్య పరిచింది.

ఒక సారి బాపట్లలోని  భావనారాయణ స్వామి గుడికి వెళ్ళగా అనసూయ గుడి లోపలే ఉన్న విషయం గమనించని పూజారి గుడి తలుపులు మూసేసి వెళ్ళి మరునాడు తలుపులు తెరవగా అనసూయ రాజ్యలక్ష్మీ అమ్మ వారుగా దర్శన మిచ్చింది. మరో సారి ఒక పోలీసు ఉద్యోగి అమ్మ మెడలోని పులిగోరు తీసుకోవటానికి ప్రయత్నిస్తే ఆమే తీసి ఇచ్చింది. అతను ఆశ్చర్య పడి మళ్ళీ భక్తితో ఆమె మెడకు అలంక రించి నమస్కరించి వెళ్లి పోయాడు. దానితో అనసూయ అంటే అందరికీ అనంత విశ్వాసం కలిగి ఆమెను సర్వ దేవత స్వరూపిణిగా భావించారు.

1936 మే 5 న తన పదమూడవ ఏట అనసూయకు మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వర రావుతో బాపట్లలో వివాహం జరిగింది. నాలుగేళ్ల తర్వాత 1940లో జిల్లెళ్ళమూడి లో స్ధిరపడ్డారు. చేరి అక్కడ కాపురమున్నారు. ఆగ్రామానికి ప్రయాణ సౌకర్యమే లేదు. వారి పెద్దకొడుకు సుబ్బారావు గ్రామ సర్పంచ్ అయిన తర్వాతే 1966లో రోడ్డు వేశారు.

భర్త బ్రహ్మాండం నాగేశ్వర రావు గారితో అమ్మ

అనసూయను మీరెవరు అని అడిగితే “నేను అమ్మని మీరు నా బిడ్డలు” అనేవారు. ఆమె వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. జిల్లెళ్ళమూడిలో  ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలమీద ఉపదేశాలు ఇచ్చేవారు. భక్తులు వీరిని “అమ్మ” అని భక్తిగా పిలుస్తారు. ఆ తరువాత జిల్లెలమూడి అమ్మగా ప్రసిద్ది చెందారు.

బ్రహ్మండం నాగేశ్వరరావు గారు తన భార్యలో ఒక దివ్య మూర్తిని చూసి, ఆమె భక్తుడిగా మారారు. కాని అమ్మ మాత్రం, తన భర్త పాద పూజ చెయ్యటం కొనసాగించారు. భక్తులు, అమ్మ భర్తను “నాన్నగారు” అని పిలుచుకునేవారు. అయన 1981లో మరణించారు.

అమ్మకు సుబ్బారావు, హైమ అనే ఇద్దరు సంతానం కలిగారు. హైమ 1944లో జన్మించి, 1968లో మరణించారు. అమ్మ మొదటినుండి, తన కుమార్తె త్వరలోనే ఈ భూ ప్రపంచం వదిలి వెళ్ళిపోతుందని తెలుసుకున్నారు. ఆమె తరువాత అనారోగ్యంతో మరణించారు. అమ్మ తన కుమార్తెకు దైవత్వం ఇచ్చి, ఖననం చేయించి అక్కడ ఒక గుడి కట్టించి దానికి “హైమాలయం” గా పేరు పెట్టారు.

కుమార్తె హైమతో అమ్మ

జిల్లేళ్ళముడిలో నిరంతరం అన్నదానకార్యక్రమం జరిగే ఆలయం :

1958 ఆగస్టు 15 న అమ్మ తన స్వహస్తాలతో అన్నపూర్ణాలయం ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కడ నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. పేద, గొప్ప, కులం, మతం అనే తేడా లేకుండా ఎంత మంది వచ్చినా ఎప్పుడొచ్చినా అక్కడ భోజనం వడ్డిస్తారు. అమ్మ దివ్య ఆశీస్సులతో “మాతృశ్రీ విద్యా పరిషద్” 1971 ఆగస్టు 6 న జిల్లెళ్ళమూడిలో ప్రారంభమైంది.

పరిషద్ ఆధ్వర్యంలో అదే రోజున మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి ప్రారంభమైంది. కళాశాల ప్రారంభంలో కేవలం ముగ్గురు లెక్చరర్లు, 25 మంది పిల్లలతో ప్రారంభించారు. నేడు, పరిషద్ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి, సంస్కృత పాఠశాలలను నడుపుతోంది.

మాతృశ్రీ మెడికల్ సెంటర్ 1978 వ సంవత్సరంలో జిల్లెళ్ళమూడిలో ప్రారంభించబడింది. అమ్మను జీవితకాలంలో సందర్శించిన ప్రముఖులలో రఘువర దాసు, ఆత్మానంద స్వామి లక్ష్మణ యతీంద్రులు, నరసింహ యోగి, ప్రభాకర ఉమా మహేశ్వర పండిట్, కుర్తాలం పీఠాధిపతి శివ సదానంద భారతీస్వామి, ప్రసాద రాయ

కులపతి, కరుణశ్రీ, జటావల్లభుల పురుషోత్తం, జమ్మలమడక మాధవ రామ శర్మ, ఎక్కిరాల కృష్ణమాచార్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్యులు, దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు, గుడిపాటి వెంకట చలం వంటి వారెందరెందరో ఆమెను దర్శించారు…

దుఃఖమే చైతన్యం, “దేవుడున్నాడా అని అనుమానం కలిగినప్పుడు, నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో, నీ మీద నీకు నమ్మకం లేనపుడు, దేవుని మీద నమ్మకం పెంచుకో అంతరాత్మ – భగవంతుడు ఒకే సూత్రానికి సంభందించిన రెండు ధ్రువాలని అమ్మ ఉపదేశించారు.

ఒకరోజు 60 సంవత్సరాల స్త్రీ, అమ్మ వద్దకు వచ్చి మంత్రోపదేశం కోరగా అందుకు అమ్మ, “నాకే మంత్రమూ రాదు తల్లీ, ఇంక నీకేమి బోధిస్తాను?” అంటూ కూతుళ్ళనూ, కోడళ్ళనూ, కొడుకులనూ, అల్లుళ్ళనూ ఒకే రకంగా చూసుకోవాలని, ఇదే అద్వైతం అని ఉపదేశించారు.

బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు 1981లో మరణించారు. 1953లోనే అమ్మ తన నిర్యాణాంతరం ఎక్కడ ఉంచాలో తెలియచేశారు. 1985 వ సంవత్సరం  జూలై 12 న అరవై మూడవ ఏట అమ్మ మరణానంతరం ఆమె భక్తులు ఒక గుడిని నిర్మించి దానికి “అనసూయేశ్వరాలయం” గా నామ కారణం చేసి అందులోనే అమ్మ భౌతిక కాయాన్ని, ఖననం చేసి ఆ ప్రదేశంలో అమ్మ నల్ల రాతి విగ్రహం నెలకొల్పి ప్రతి సంవత్సరం మే నెల 5వ తేదీన అమ్మ పెళ్ళి రోజును ఘనంగా ఆ గుడిలో జరుపుకునేవారు. ఈ నాటికీ గర్భ గుడిలో అమ్మకు పూజలు జరుగుతూ ఉన్నాయి.

 

జిల్లేళ్ళమూడి అమ్మ బాల్యం ఈనాటి బాలబాలికలకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. మంచితనాన్ని, త్యాగాన్ని నేర్పుతుంది. అందరితో కలిసి జీవించడం ఎట్లాగో చూపించి, సంస్కృతిని, సంస్కారాన్ని ఆచరించడం ఎట్లాగో తెలియజేస్తుంది.

– అనంత విజయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.