ఇక చాలు వెనక్కు వెళ్ళండి – వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనకారులకు స్థానికుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత

సాగు చట్టాలకు వ్యతిరేకంగా 60 రోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనకారులు ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సింఘూ సరిహద్దులో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు సింఘూ సరిహద్దు నుంచి రైతులు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వెంటనే ఖాళీ చెయ్యండి లేకపోతే మేమే ఖాళీ చేయిస్తాం – అధికారుల ఆదేశం
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి యూపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ – యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద ఆందోళన విరమించి రోడ్లను ఖాళీ చేయాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం ఈ రాత్రి వరకు గడువు విధించారు. ఒకవేళ ఆందోళనకారులు ఖాళీ చేయకపోతే తామే బలవంతంగా ఖాళీ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో నిరసనకారులు చేపట్టిన ట్రాక్టర్ల పరేడ్ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో వారి నిరసనల పట్ల యూపీ కఠిన వైఖరి తీసుకుంది. వారి నిరసనల దృష్ట్యా నవంబర్ 26 నుంచి ఘజీపూర్ సరిహద్దును మూసివేశారు. అయితే, వారు మంగళవారం రోజున బారికేడ్లను ధ్వంసం చేసి ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. మరోవైపు, జాతీయ రహదారుల పనులు పెండింగ్లో ఉండటంతో నేషనల్ హైవేల అథారిటీ నుంచి తమకు అభ్యర్థనలు వచ్చినట్టు కూడా అధికారులు చెబుతున్నారు.





