
సుదీర్ఘ కాలం పాటు భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా, రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన శ్రీ లింగమనేని రామకృష్ణ ప్రసాద్ ( L.R. K ప్రసాద్) గారు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు.
పోరాట యోధుడు శ్రీ L. R. K ప్రసాద్ :
అవి భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తొలిరోజులు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరుగబోతున్నవి. కృష్ణలంక చాలా సందడిగా ఉంది. ఎందుకంటే విజయవాడ రాజకీయాలలో ప్రముఖపాత్ర వహిస్తున్న శ్రీ వంగవీటి మోహనరంగా అక్కడ పోటీచేయ బోతున్నారు. భారతీయ జనతాపార్టీ వీలైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీచేసే ప్రయత్నంలో ఉంది. రంగాపై పోటీగా అభ్యర్థిని దించటం సాధ్యమా? అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. సాధ్యమేనని ఋజువు చేశారు ఎల్ ఆర్. కే. ప్రసాద్ గారు . అప్పుడు బీజేపీ నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్ ఆర్. కే. ప్రసాద్ గారు పోటీ చేశారు. అక్కడ పోటీ చేయటం గానీ, ప్రచారం చేయటం అంత ఆషామాషీ ఏం కాదు. అయినా, దృఢంగా నిలబడినవ్యక్తి శ్రీ ప్రసాద్ గారు. ఆ విధంగా చేసిన ప్రయత్నాలలో నుండే విజయవాడలో మొదటిసారిగా భాజపా ఒంటరిగా పోటీచేసి మూడు స్థానాలను గెలుచుకో గలిగింది. (జనసంఘం రోజులలోకూడా పార్టీ అభిమానులు గెలిచారేగాని, పార్టీ అభ్యర్థులు గెలువలేదు.)
ఆ తర్వాత రోజులలో ప్రసాద్ గారు ఎన్నడూ ఎన్నికలలో పోటీ పడలేదు. కానీ ఎంత బృహత్కార్యం తలపెట్టినా భుజాన వేసుకొని పనిచేసే వారిలో ముందుండేవారని, అఖిల భారత మహాసభలు విజయవాడలో నిర్వహించటం ప్రసాద్ గారివంటి సమర్పణభావం కల్గినకార్యకర్తలు ఉండటం వల్లే సాధ్యమైందని పార్టీ సీనియర్లు కొందరు వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాలకు పైబడి మూల స్తంభాలుగా నిలబడిన డా౹౹ఎం. డి. రామారావుగారు, ఎల్.ఆర్.కె. ప్రసాద్ గారు కొద్ది నెలల తేడాతో దివంగతులవటం బీజేపీ కార్యకర్తల్ని దిగ్భ్రమకు గురిచేస్తోంది.





