
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొన్న పాశ్వాన్ గురువారం సాయంత్రం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం భౌతికకాయాన్ని ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాశ్వాన్ పార్థివదేహానికి అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. కేంద్రమంత్రి మృతికి సంతాప సూచకంగా రాష్ట్రపతిభవన్, పార్లమెంట్‌పై జాతీయ జెండాలను అవనతం చేశారు. శనివారం పాట్నాలో పాశ్వాన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
వర్తమాన రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన దళిత నాయకుడిగా ఎదిగిన పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు చిరాగ్ పాశ్వాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బిహార్ ఎన్నికల సమయంలో పాశ్వాన్ మృతిచెందడం ఆ పార్టీ వర్గాలను శోకసంద్రంలో ముంచింది.