
ఇంజినీరింగ్ పరిజ్ఞానంలో తమని మించిన దేశం లేదని గొప్పలు చెప్పుకొంటున్న చైనా మాటలు వట్టి డొల్లే అని తేలిపోయింది. గత 50ఏళ్లలో నిర్మించిన వేలాది డ్యామ్‌లు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. నాసిరకంగా నిర్మించిన ఆనకట్టలు అక్కడి ప్రజలకు శరాఘాతంగా పరిణమిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు ఎన్నడూ ఊహించని ఉప ద్రవాన్ని ఎదుర్కొంటున్నట్లు సాక్షాత్తూ చైనా హైడ్రాలజీ విభాగమే హెచ్చరించింది.
చైనాలోని గ్వాంగ్‌జీ ప్రాంతంలోని ఓ చిన్న రిజర్వాయర్‌పై నిర్మించిన డ్యామ్.. గత నెల 7న భారీ వర్షాల కారణంగా కుప్పకూలింది. డ్యామ్‌లోని వరద నీరు సమీపంలోని యాంగ్షో నగరం, షాసిగ్జీ గ్రామాలపై సునామీలా విరుచుకుపడింది. దీంతో రోడ్లు, తోటలు, పొలాలు నామరూపాల్లేకుండాపోయాయి. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు సైతం వరద కోరల్లో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పట్లో కోలుకోని విధంగా.. ఎటు చూసినా వరద విలయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి వరదలను తానెప్పుడూ చూడలేదని దశాబ్దాల కిందట డ్యామ్ నిర్మాణంలో సహాయపడిన ఓ గ్రామస్తుడు లుయో కివియాన్ తెలిపారు. లక్షా 95వేల క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యంతో 1965లో పూర్తయిన ఈ ఆనకట్ట.. షాసిగ్జీ ప్రాంత నీటి పారుదల అవసరాలను గత 50ఏళ్లుగా తీర్చింది.

వ్యవసాయ ఆధారిత దేశం చైనాలో కరవును నివారించడానికి అప్పటి అధ్యక్షుడు మావో జెడాంగ్ పెద్ద ఎత్తున ఆనకట్టల నిర్మాణానికి పూనుకున్నాడు. 1950-60 కాలంలో హడావిడిగా వేలాది ఆనకట్టలను నదులపై నిర్మించారు. అందులో చాలా వరకు నదులు నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. 1954-2005 మధ్య కాలంలో చైనాలో దాదాపు 3,486 జలాశయాల రాతికట్టలు తెగిపోయినట్టు ఆ దేశ నీటిపారుదలశాఖ ఓ నివేదికలో పేర్కొంది. చైనాలో గత కొన్నేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పొటెత్తుతున్నాయి. వరదల ధాటికి డ్యామ్‌ల రక్షణ సామర్థ్యం తగ్గిందని చైనా హైడ్రాలజీ విభాగం పేర్కొంది. దాదాపు 94వేల ఆనకట్టలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని హెచ్చరించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
విచిత్రమేమిటంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా చైనా మీడియా ఎక్కడా ఎలాంటి వార్త ప్రచురించలేదు. వరదల్లో ఎంత నష్టం జరిగిందన్న విషయం కూడా ఆ దేశ మీడియా దాచిపెట్టింది. షాసిగ్జీ ప్రమాదంపై స్పందించడానికి ఆ దేశ నీటిపారుదల శాఖ నిరాకరించింది.





