ArticlesNews

1962 నాటి వార్త నేడు ఒక హెచ్చరిక

754views

జూలై 15, 1962 లో వచ్చిన వార్తాపత్రిక శీర్షిక, ‘చైనీస్ దళాలు గాల్వన్ పోస్ట్ నుండి ఉపసంహరించుకుంటున్నాయి’. అనేది. అదే వార్త ఇప్పుడు జూలై 2020 లో కూడా వైరల్ అవుతోంది. 1962 నాటి అనుభవం మనకు ఇప్పుడు ఒక హెచ్చరిక కావాలి.

గాల్వన్ వ్యాలీ వద్ద నుంచి ఉభయ దేశాల సైనిక దళాలు వెనక్కు మరలడం గురించిన వివరాలను బయట పెట్టడానికి మన సైన్యం విముఖత చూపింది. ఉద్రిక్తతలను నివారించడానికి భారత, చైనా దళాల మధ్య కొంత దూరం పాటించే ప్రక్రియగా మాత్రమే వారు దీనిని అభివర్ణిస్తున్నారు.

‘ఇవి చాలా పరిమితమైన చర్యలు. కానీ మేము జాగ్రత్తగా ఉండాలి. చైనీయులను నమ్మలేము.’ ఇదీ వారు చెప్తున్న మాటలు.

 

ఈ హెచ్చరికకు కారణం జూలై 15, 1962 లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆదివారం పత్రికలో వచ్చిన “గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా దళాలు ఉపసంహరించుకుంటున్నాయ”న్న వార్త. ఆ తర్వాత సరిగ్గా 96 రోజుల తరువాత అక్టోబర్ 20 న చైనా-ఇండియన్ యుద్ధం ప్రారంభమైంది.

అసలప్పుడు ఏం జరిగింది?

‘1962 వేసవి ప్రారంభంలో భారతదేశం గాల్వన్ లోయను బలోపేతం చేసింది. భయంకరమైన గూర్ఖాలను ఎగువ ప్రాంతాలలో మోహరించింది. జూలై 6 న, ఒక చైనీస్ మిలిటరీ ప్లాటూన్ ఈ ప్రాంతంలో ఉన్న గూర్ఖాలను గుర్తించి వారి ప్రధాన కార్యాలయానికి నివేదించింది. నాలుగు రోజుల తరువాత, 300 మంది చైనా దళాలు 1/8 గూర్ఖా రెజిమెంట్‌ను చుట్టుముట్టాయి.

జూలై 15 న, గాల్వన్ పోస్ట్ నుండి 200 మీటర్లు చైనా ఉపసంహరించుకున్నట్లు వార్తాపత్రికలు పేర్కొన్నాయి. కానీ ‘ఉపసంహరణ’ స్వల్పకాలికమే. చైనీయులు మరళా తిరిగి వచ్చారు.

భారత్, చైనాల నిరసన లేఖల మార్పిడి తరువాత మూడు నెలలకు నాయక్ సుబేదార్ జంగ్ బహదూర్ నాయకత్వంలో గూర్ఖాలు తమ భూభాగంపై పట్టు సాధించి భారత సైనిక చరిత్రలో క్రొత్త ఇతిహాసాన్ని లిఖించారు.

అక్టోబర్ ఆరంభం నాటికి, శీతాకాలం ప్రారంభమై ఉష్ణోగ్రతలు సున్నాకు పడిపోవడంతో, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అక్కడికి మరింతమంది గోర్ఖాలను చేర్చాలని, మేజర్ ఎస్ ఎస్ హసాబ్నిస్ ఆధ్వర్యంలో 5 జాట్స్ ఆల్పా కంపెనీని అక్కడికి పంపాలని నిర్ణయించుకున్నారు. ఎంఐ -4 హెలికాప్టర్లు అక్టోబర్ 4 వ తేదీ నుండి సోర్టీలను తయారు చేయడం ప్రారంభించాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయింది కూడా.

అక్టోబర్ 20, 1962న, చైనీయులు గాల్వన్ పోస్ట్ పై కాల్పులు జరిపి 36 మంది భారతీయ సైనికులను చంపారు. మేజర్ హసబ్నిస్ పట్టుబడ్డాడు. 1962 యుద్ధం అధికారికంగా ప్రారంభమైంది. మేజర్ హసాబ్నిస్ POW శిబిరంలో ఏడు నెలలు గడిపాడు. యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి వచ్చాడు.

యాదృచ్ఛికంగా, అతని కుమారుడు లెఫ్టినెంట్ జనరల్ హసాబ్నిస్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్.

తన కుమారుడు, ప్రస్తుత లెఫ్టినెంట్ జనరల్ హసాబ్నిస్‌తో 1962లో చైనీయులకు బందీగా చిక్కిన అప్పటి లెఫ్టినెంట్ కల్నల్ హసాబ్నిస్. 

ప్రస్తుతం చైనీస్ ఆర్మీ వెనుదిరగడం పట్ల వారు ఎందుకు ఆచి తూచి స్పందిస్తున్నారో వివరించడానికి ఆర్మీ అధికారులు 1962 నాటి హెడ్‌లైన్‌ను ఉదాహరణగా చూపుతున్నారు. వారు చెప్పినట్లు, చరిత్ర తెలియని వారు దానిని పునరావృతం చేసే అవకాశం కూడా ఉంటుంది.

అనువాదం : శ్రీరాంసాగర్

Source : News18

https://www.news18.com/news/india/a-1962-news-report-cautionary-tale-why-indian-army-is-cautious-of-chinas-current-disengagement-2704467.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.