
రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికుల సహాయార్థం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సేవా భారతి లు నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒకరోజు ఐదు మంది పదవ తరగతి విద్యార్థులు పెద్దవారైన కొందరు కార్యకర్తలకు తోడుగా సేవా కార్యక్రమాలలో సాయం పట్టడానికి వెళ్లారు. రోజంతా ఉత్సాహంగా కార్యకలాపాలలో పాలు పంచుకున్నారు.
తెల్లారి పొద్దున యధావిధిగా కార్యకర్తలు సహాయ కార్యక్రమాలకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ముందు రోజు జరిగిన సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాలుపంచుకున్న ఐదుగురు పదవ తరగతి విద్యార్థులు నెమ్మదిగా అక్కడ ఉన్న ఒక జేష్ట కార్యకర్త వద్దకు చేరుకున్నారు. తాను గబగబా ఆహార పొట్లాలు మిగతా వారికి కూడా పని పురమాయిస్తూ బిజీగా ఉన్న ఆ కార్యకర్త అంత హడావుడిలోనూ వారి వైపు చూసి నవ్వుతూ పలకరించారు. ఆ పిల్లలు కూడా నవ్వుతూ ఆయనకు నమస్కారం పెడుతూ దగ్గరగా వచ్చారు. ” అన్నా నిన్న మనం ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్లకి భోజనాలు అవీ అందించాం కదా? ఆ పనికి మేం కూడా కొంత డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం…..” కొంత తటపటాయిస్తూ అడిగారు ఆ చిన్నారులు. వెంటనే ఆ పెద్దాయన నవ్వుతూ ” ఓ దాందేముంది సంతోషంగా ఇవ్వండి.” అన్నారు. ఆ పిల్లలు” అంటే…. కొంచెం డబ్బులే అన్నా…. పాకెట్ మనీలో నుంచి మేం దాచుకున్నవి…..” అన్నారు కొంచెం మొహమాటంగా. “ఎంతైతే ఏముంది? వయసులో చిన్నవారైనా పెద్ద మనసుతో సాయం చేయడానికి ముందుకు వచ్చారు మీరు. అదే చాలా పెద్ద విషయం. మీరిస్తున్న మొత్తం ఎంతైనా ఇవ్వాలన్న మీ సంకల్పమే గొప్పది.” అంటూ ప్రశంసించారు ఆ కార్యకర్త. వయసులో చిన్నవారైనా హృదయ వైశాల్యంలో ఈ చిన్నారులు గొప్పవారే కదూ? వారిని మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దామా?





