News

కరోనా రోగులు పశువుల కంటే హీనమా? – ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న

677views

రోనా నేపథ్యంలో దేశ రాజధాని నగరం సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు చికిత్స, కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ జరిపింది. ఢిల్లీలో కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారనీ.. ఆస్పత్రుల్లో మృతదేహాల నిర్వహణ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్తకుప్పలో మృతదేహాలు కనబడటం వంటి దృశ్యాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను ఉంచడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది.

ఢిల్లీలో పరీక్షలు తగ్గాయెందుకు?

దేశ రాజధాని నగరంలో కరోనా పరీక్షల శాతం ఎందుకు తగ్గిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తొలుత కరోనా పరీక్షల నిర్వహణలో అగ్రస్థానంలో ఉన్న దిల్లీ క్రమంగా ఎందుకు కిందకు పడిపోయిందని అడిగింది. గతంలో రోజుకు 7వేల పరీక్షలు చేస్తే.. ఇప్పుడు కేవలం 5వేల పరీక్షలే చేస్తున్నారని తెలిపింది. చెన్నై, ముంబయి నగరాల్లో 16వేలు నుంచి 17వేలకు పరీక్షల సంఖ్య పెరిగిందని పేర్కొంది. కరోనా రోగులు ఆస్పత్రుల్లో పడకలు లేక ఇబ్బందులు పడుతున్నారని మీడియాలో కథనాలు వస్తుంటే.. ప్రభుత్వాలు మాత్రం పడకలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తామని తెలిపింది.

బంధువులకు కూడా సమాచారం ఇవ్వరా?

కరోనాతో చనిపోతే వారి బంధువులకు కూడా సమాచారం ఇవ్వలేదన్న మీడియా కథనాలు చూస్తేనే పరిస్థితి అర్థం అవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.