
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రైతు తాను పండించిన ధాన్యం అమ్ముడు పోకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాల పల్లి గ్రామానికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి తాను పండించిన ధాన్యం అమ్ముడు పోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్న దృశ్యాన్ని ఆ రైతు సెల్ఫీ వీడియోలో చిత్రీకరించారు. తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుక్కోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని, దాంతో దిక్కు తోచక తాను ఆత్మహత్యకు ఒడిగడుతున్నానని, తన పిల్లలను ఆదుకోవాలని, తన లాంటి దుస్థితి మరే రైతుకూ రాకుండా చూడాలని మంత్రి కేటీఆర్ ని కోరుతూ మహీపాల్ రెడ్డి ఒక సెల్ఫీ వీడియోని చిత్రీకరించి ఆత్మహత్యకు యత్నించారు. అయితే స్థానికులు సకాలంలో గుర్తించడంతో ఆ రైతుకు ప్రాణాపాయం తప్పింది.
కానీ మహిపాల్ రెడ్డి చేసిన ప్రయత్నం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చింది. పెద్ద పెద్ద చదువులు చదివామంటూ ఉన్నత కొలువులు వెలగబెడుతున్న వారి కంటే అందరికీ అన్నం పెట్టే రైతున్న ఎందుకు వెనకబడుతున్నాడు? ఎందుకు దగా పడుతున్నాడు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.





