
జీ-7 కూటమి దేశాల సదస్సును జూన్లో నిర్వహించాలని భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కూటమిలో మరికొన్ని దేశాలనూ చేర్చుకోవాలని సంకేతాలు ఇచ్చారు. ఈ జాబితాలో రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా భారత్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఉన్న సభ్యదేశాల కూర్పు ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహించేలా లేదని అభిప్రాయపడ్డారు. ట్రంప్ తాజా ప్రతిపాదన.. అంతర్జాతీయంగా భారత్ పరపతి పెరుగుతోందనడానికి సంకేతంగా చెప్పొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కూటమే జీ-7. దీనిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది దీనికి అమెరికా అధ్యక్షత వహిస్తోంది. ప్రతి సంవత్సరం జరిగే వార్షిక సదస్సుకు ఒకటి లేదా రెండు ఇతర దేశాల అధినేతలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం అధ్యక్షత వహించిన ఫ్రాన్స్.. మన ప్రధాని మోదీని ఆహ్వానించింది. మరోసారి ఈ సదస్సుకు మోదీని ఆహ్వానించేందుకు అమెరికా యోచిస్తున్నట్లు సమాచారం.





