News

న్యాయ వ్యవస్థపై విశ్వాసం లేనప్పుడు మీ వాదన మేమెందుకు వినాలి? – సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

1.4kviews

లస కూలీలను స్వస్థలాలకు పంపించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించే క్రమంలో సుప్రీంకోర్టు ఆ కేసులో వలస కూలీల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీ వాదన మేమెందుకు వినాలి?

వలస కూలీల ప్రాథమిక హక్కులు అమలు కానప్పటికీ ఎలాంటి తనిఖీ చేయకుండానే సుప్రీంకోర్టు ప్రభుత్వ వైఖరినే గుడ్డిగా పరిగణనలోకి తీసుకుంటున్నదని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. వ్యవస్థపై విశ్వాసం లేనప్పుడు న్యాయస్థానం ఆయన వాదనను ఎందుకు వినాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. “న్యాయ వ్యవస్థపై మీకు విశ్వాసం లేదు. అలాంటప్పుడు మీ వాదనను కోర్టు ఎందుకు వినాలి? మీరనుకుంటున్నట్టు ఈ కోర్టు ప్రభుత్వం చేతిలో బందీ కాదు” అని కోర్టు ఘాటుగా బదులిచ్చింది.

అన్ని తీర్పులూ మీకు అనుకూలంగా రావు

రాజ్యాంగం ద్వారా ఈ కోర్టు ఏర్పడిందని, కానీ తాను వలస కూలీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో వేదన చెంది మాట్లాడుతున్నానని ప్రశాంత్ భూషణ్‌ బదులిచ్చారు. వ్యవస్థపై విశ్వాసం లేదని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. తనది తప్పే కావొచ్చని అయితే కొందరు విశ్రాంత న్యాయమూర్తుల అభిప్రాయమూ ఇదేనని తెలిపారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. 30 ఏళ్లుగా సుప్రీం కోర్టులో వాదిస్తున్న భూషణ్‌కు కొన్ని తీర్పులు అనుకూలంగా వస్తాయని, కొన్ని రావని తెలుసుండాలంది. అంతమాత్రాన కోర్టు విశ్వసనీయతనే ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికింది.

వలస కూలీల ప్రయాణానికి అనుమతించకపోవడాన్ని కేవలం ప్రశాంత్‌ భూషణ్‌ మాత్రమే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. వలస కార్మికులకు సాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని వివరించారు. ఈ క్రమంలో తాను న్యాయవాదిగా రావడం అభ్యంతరమైతే తన స్థానంలో మరొకరు వస్తారని ప్రశాంత్ భూషణ్‌ అనగా అలా తామెప్పుడూ అనలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రశాంత్ భూషణ్ చెప్పేవన్నీ అసత్యాలే – సొలిసిటర్ జనరల్

వలస కూలీల్లో 90% మందికి రేషన్‌, జీతాలు అందలేదని, దయనీయ స్థితిలో ఉన్న వారిని స్వస్థలాలకు అనుమతించాలని భూషణ్‌ కోరారు. ఇవన్నీ తప్పుడు నివేదికలని, పిటిషనర్ల సమాచారం నిరాధారమని మెహతా అన్నారు. ఈ అంశంపై రాష్ట్రాలను కేంద్రం సంప్రదించిందన్నారు. ఎందరిని తరలించారు? ఎందరికి సాయం చేస్తున్నారో వంటి వివరాలు తెలుసుకుందని తెలిపారు. ప్రభుత్వం అన్నిటినీ కూలంకషంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించాలని భూషణ్‌ కోరగా మెహతా అభ్యంతరం తెలిపారు. విస్తృత ప్రజా ప్రయోజనార్థం ఇది ప్రభుత్వం చూసుకోవాల్సిన వ్యవహారమని బదులిచ్చారు.

కేంద్రానికి వారం గడువు – సుప్రీం

నోటీసులు జారీ చేయొద్దని, ఆదేశాలిస్తే ఇది తప్పుడు సందేశం ఇచ్చినట్టవుతుందని సొలిసిటర్‌ జనరల్‌ మెహత కోర్టును కోరారు. ప్రభుత్వం బదులివ్వడానికి రెండు వారాల గడువు ఇవ్వాలని కోరారు. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించే ప్రతిపాదన ఉందో లేదో తెలిపేందుకు వారం రోజుల గడువు ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.