
భారతీయులకు ముఖ్యమైన పర్వదినాల్లో ప్రధానమైనది విజయదశమి. మహిళా శక్తికి నిదర్శనమైన పార్వతీదేవి, చండప్రచండులైన రాక్షసులను తొమ్మిది రోజులలో తుదముట్టించడానికి ప్రతీకగా శరన్నవరాత్రులు జరుపుకుంటాం. మహాదేవి సాధించిన ఆ అద్భుతమైన విజయాలను వేడుకగా పదవరోజు విజయదశమి పండుగ చేసుకుంటాం. స్త్రీశక్తిని ఇంత గొప్ప పర్వదినంగా గౌరవించుకునే సంప్రదాయం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు.
ఈ సృష్టికి మూలభూతమైనది యోగమాయాశక్తి. ఆ మాయ ఆవరించినప్పుడు విష్ణుమూర్తి సైతం యోగనిద్రలోకి జారుకుంటాడు. అందుకే బ్రహ్మదేవుడు తనకు మధుకైటభ రాక్షసుల వల్ల ముప్పు వాటిల్లినప్పుడు యోగమాయను ధ్యానించి ఆమె చెప్పినట్లు చేసాడు. యోగమాయా ప్రభావం చేతనే విష్ణుమూర్తి ఆ దుర్మార్గులైన రాక్షసులను మట్టుపెట్టగలిగాడు. ఆ యోగమాయయే విశ్వావిర్భావకారకమైన మహాశక్తి. ఆమెయే పరదేవత అయిన జగదంబ. అనంతర కాలంలో మహిష ప్రవృత్తి కలిగిన రాక్షసుడు నేరుగా దేవితోనే యుద్ధానికి కాలుదువ్వాడు. ప్రజలకు ప్రమాదకారకమైన ఆసురీ శక్తిని జగదంబ నిర్జించి ప్రజలను రక్షించింది. ధర్మం వైపు నిలిచి ఉండే దేవతలకు, అధర్మానికి చిరునామాగా నిలిచిన దానవులకూ మధ్య సమరం జరిగి దేవతలు పరాజయం పొందిన ప్రతీసారీ అమ్మ వారిని అనుగ్రహించింది. ఆసురీమాయను నిర్మూలించింది. రాక్షస గణాల అకృత్యాల నుంచి ప్రజలను కాపాడింది. కాళి, కాపాలిక వంటి భయానక రూపాలలో అవతరించి రక్కసులను మట్టుపెట్టింది, భూమికి భారాన్ని తగ్గించింది. అదే క్రమంలో రక్తబీజుడు, నిశుంభుడు, శుంభుడి వంటి రక్కసులను హతమార్చింది. అలాంటి శ్రీదేవీ లీలలను తొమ్మిది రోజులు స్మరించుకుని, చివరిగా పదవనాడు విజయదశమి సందర్భాన వేడుకలు జరుపుకోవడం భారతీయ సంప్రదాయం.
భారతీయులకు పరమపూజ్యమైన ఆదికావ్యం శ్రీమద్రామాయణం. వాల్మీకి మహర్షి అక్షరబద్ధం చేసిన రమ్యమైన రామచరితం భారత జనమానసాల్లో నిలిచిపోయిన మహాకావ్యం. సీతమ్మ తల్లిని రక్షించడానికి రాముడు యుద్ధం చేసి రావణాసురుడిని పరిమార్చినది కూడా విజయదశమి నాడే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన ఆనాడు రామలీల వేడుక వైభవంగా జరుపుతారు. రావణుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుల మూర్తులను తయారుచేసి వాటిని బాణాసంచాతో నింపి శ్రీరామమూర్తితో బాణం వేయించి కాల్పించడం ద్వారా రామాయణ ఘట్టాన్ని ఆవిష్కరిస్తారు. ఏ యుగంలోనైనా శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అత్యవసరం అన్న ధర్మసూక్ష్మాన్ని చాటిచెప్పే పర్వదినమిది.
భారతీయులకు విజయదశమి మరో మహత్తరమైన సందర్భం కూడా. దేశం పట్ల, ధర్మం పట్ల నిష్ఠను చాటిచెప్పే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపనా దినం కూడా విజయదశమి పర్వదినమే. 1925 ఆంగ్ల సంవత్సరంలో విజయదశమి నాడు డాక్టర్జీ కేశవ బలీరామ్ హెడ్గేవార్ సంఘాన్ని ప్రారంభించారు. పరాయి పాలకుల నుంచి కావలసినది కేవలం రాజకీయ స్వతంత్రం మాత్రమే కాదని, సాంస్కృతిక జాతీయభావాలను జాగృతం చేయవలసిన పరిపూర్ణ స్వతంత్రమనీ హెడ్గేవార్ గుర్తించారు. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు. ఏ వ్యక్తినో గురువుగా భావించకుండా భారతీయ సంప్రదాయంలో అత్యున్నతమైన త్యాగభావనకు ప్రతీక అయిన కాషాయ ధ్వజాన్నే గురువుగా పరిగణించేలా స్వయంసేవక వ్యవస్థను తీర్చిదిద్దారు. అలాంటి మహోత్కృష్టమైన సంస్థ శతాబ్ది వేడుకలు ఈ విజయదశమి పర్వదినంతో పూర్తవుతున్నాయి. దేశసేవ, జనజాగరణే లక్ష్యంగా మరో శతాబ్దంలోకి సంఘం అడుగుపెడుతున్న మేలిమి బంగరువన్నె పండుగ ఇది. ఈ విజయదశమి అందరికీ విజయాలను అందించుగాక. అందరి మనసులలోనూ ధార్మక భావనలను ప్రోదిచేయుగాక.




