
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన 36 రోజుల ఉధృత ఉద్యమం ముగిసింది. అయితే, ఒక సామాజిక మాధ్యమ వ్యంగ్య పేజీగా మొదలైన ఈ ఉద్యమం వెనుక ఉన్న వ్యూహాలు, నిధుల మూలాలు, అంతర్జాతీయ సిద్ధాంతాల పాత్రపై ఇప్పుడు తీవ్రమైన చర్చ మొదలైంది. అనుసరించిన పద్ధతులు, ఇచ్చిన నినాదాలు, చేసిన ప్రసంగాలు కారణంగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంత తక్కువ కాలంలో అన్ని వందల మంది యువతీ యువకులను సమీకరించి, 36 రోజుల పాటు అంత ఉధృతంగా ఉద్యమించటానికి కావలసిన సన్నాహాలు ఎవరు చేసారు? వనరులు ఎవరు సమకూర్చిపెట్టారు? అన్నవి కూడా కీలకమైన ప్రశ్నలు. CJP ఎ న్నికల ప్రణాళిక, దాని డిమాండ్లు, నిరసన విధానం – ఇవన్నీ పోపోవిచ్ సిద్ధాంతీకరించిన “డైలమా ఆఫ్ యాక్షన్స్” (dilemma of actions) అనుసరించి రూపొందించబడ్డాయా అన్న అనుమానం బలంగా ఉంది
నవ్వునే ఆయుధంగా మార్చిన ‘లాఫ్టివిజం’ (Laughtivism)
స్ట్రా పోపోవిచ్ (Srda Popović) సెర్బియా చెందిన రాజకీయ నేత, సిద్ధాంతకర్త. అధ్యక్షుడు స్లోబోడాన్ మిలోషెవిచ్ను అధికారంలో నుంచి తొలగించిన ఒట్పోర్ ఉద్యమంలోని ప్రధాన నాయకుల్లో పోపోవిచ్ ఒకరు. పో పోవిచ్ అభిప్రాయం ప్రకారం, తాము ‘అణచివేత’ ప్రభుత్వంగా భావించే ప్రభుత్వం పై కోపాన్ని ప్రదర్శిస్తే, దానికి ప్రతిగా ప్రభుత్వం కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంటుంది. కానీ పోస్టర్లు, మీమ్స్, వ్యంగ్యం, జోకులకు ప్రభుత్వం భయపడటం ప్రారంభిస్తే, అదే ప్రభుత్వం ప్రజల దృష్టిలో హాస్యాస్పదంగా, బలహీనంగా కనిపించడం ప్రారంభిస్తుంది. ఈ భావనను పోపోవిచ్ “లాఫ్టివిజం” (Laughtivism = Laugh + Activism) అని పేర్కొన్నాడు. అంటే, నవ్వును ఒక రాజకీయ వ్యాసంలో, ఆయుధంగా మార్చడం. 2013లో Foreign Policy పత్రికలో ప్రచురితమైన తన పోపోవిచ్ “డిలెమా యాక్షన్స్” (Dilemma Actions) అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అనంతరం, తన Blueprint for Revolution అనే పుస్తకంలో దీనిని మరింత వివరంగా చర్చించాడు. తన రచనల్లో పోపోవిచ్ సూచించిన ప్రకారం, ‘లాఫ్టివిస్టులు’ ప్రజలకు ప్రాధాన్యమున్న ఒక సమస్యను సృష్టించాలి లేదా గుర్తించాలి. ఆ తర్వాత, ప్రత్యర్థి ఒక సంకటస్థితిలో పడే విధంగా కార్యాచరణను రూపొందించాలి. అంటే, అహింసాత్మక ఉద్యమాన్ని కొనసాగనివ్వడం లేదా ప్రజాదరణ లేని ఆంక్షలను అమలు చేయాల్సి రావడం వంటి రెండు ఎంపికల మధ్య ప్రత్యర్థిని నిలబెట్టే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించాడు.
లాఫ్టివిజం సిద్ధాంతం ప్రకారం ప్రత్యర్థి ప్రభుత్వానికి “గెలిచినా ఓటమే, ఓడినా ఓటమే” అనే పరిస్థితులను సృష్టించటం, ప్రభుత్వం అంటే భయం పోగొట్టడం, మూకుమ్మడిగా ఎదిరిస్తే ప్రభుత్వాలు ఏమీ చేయ లేవని నిరూపించడం, అధినేతలను మీమ్స్ ద్వారా గేలిచేయడం కార్యాచరణలో ముఖ్యమైన అంశాలు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దాని ప్రతికూల ప్రభావం ప్రభుత్వానికే తగిలేలా చూడాలి. ప్రభుత్వం జోకులు లేదా మీమ్లను పట్టించుకోకపోతే, ఉద్యమానికి ఆదరణ పెరిగి అది విస్తరిస్తుంది. మరోవైపు, ప్రభుత్వం వాటికి ఆగ్రహించి చట్టపరమైన చర్యలు తీసుకున్నా లేదా అణచివేతకు దిగినా, అదే ప్రభుత్వం అత్యంత క్రూరంగా, అసహనంతో కూడినదిగా, పిరికిదిగా ప్రజల దృష్టిలో కనిపిస్తుంది. దీనినే “బ్యాక్ ఫైర్ ఎఫెక్ట్” (Backfire Effect) అంటారు. 2000 లో ఇదే సిద్ధాంతం సెర్బియాలోని నియంత పతనానికి దారితీసింది.
ఇన్స్టాగ్రామ్ బ్యాన్ – ప్రభుత్వ వ్యూహాత్మక పొరపాటు
CJP నిరసనల్లో జరిగిన పరిణామాలతో దీనికి ఉన్న పోలికను విస్మరించడం కష్టం. మోదీ ప్రభుత్వం మొదట CJPని పట్టించుకోలేదు. అనంతరం, CJP యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీని తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదే శించింది. దీంతో కాక్లోచ్లకు వారి మొదటి విజయం లభించింది. కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో సుమారు 20 మిలియన్ల అనుచరులను సంపాదించిన CJP, స్వయంగా ప్రకటించుకున్న అనుచరుల పోటీలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన BJPని అధిగమించామని పేర్కొంది. ఆ నిషేధాన్ని, యువ ‘కాక్లోరోచ్ల’ పట్ల కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నదనే సంకేతంగా CJP చిత్రీకరించింది.
తర్వాత CJP ఇన్స్టాగ్రామ్ పేజీపై విధించిన ఆంక్షను తొలగించడం కూడా కేంద్ర ప్రభుత్వానికి మరో తప్పిదంగా మారింది. మొదట విధించిన నిషేధం ప్రభుత్వాన్ని ఎగతాళికి గురిచేసింది; అనంతరం దానిని పునరుద్ధరించడం, ‘ఫాసిస్టు’ ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగిందని CJP ప్రచారం చేయడానికి మరింత అవకాశం కల్పించింది.
పోపోవిచ్ కార్యాచరణ నమూనాకు అనుగుణంగా, కాక్రోచ్ జనతా పార్టీ ప్రజలకు చర్చనీయాంశమైన NEET ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని చేపట్టింది. 2026 జూన్ మొదటి వారానికి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ CJP నిర్వహించిన ఆన్లైన్ ప్రచారం, క్షేత్రస్థాయి ‘అహింసాత్మక’ నిరసనగా మారింది. ఒకరి తర్వాత మరొకరు ఇస్లామిక్ – వామపక్ష (Islamo – leftist) వర్గాలు CJPకి మద్దతు ప్రకటించి, తమ హిందూ వ్యతిరేక మరియు ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రచారం చేయడానికి దాని వేదికను ఉపయోగించాయి.
అనేక వారాల పాటు కేంద్ర ప్రభుత్వం CJP నిరసనను కనీసం గుర్తించలేదు. ప్రభుత్వ దృష్టి లేకపోతే ఈ ‘ ఉద్యమం’ సహజంగానే క్రమంగా ముగుస్తుందని భావించి ఉండవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఈ నిర్లక్ష్య ధోరణి CJPకి తనను తాను సిద్ధం చేసుకోవడానికి, మద్దతుదారులను సమీకరించడానికి, పూర్తి శక్తితో ప్రభుత్వంపై దాడి చేయడానికి అవకాశం కల్పించింది.
NEET లీకేజీ – అయాచితంగా వచ్చిన ప్రజాదరణ
NEET ప్రశ్నాపత్రం లీకేజీ వారికి అయాచితంగా అందివచ్చిన ఒక అవకాశం. మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపరు లీక్ అయింది.ఆ పరీక్షను రద్దు చేశారు. జూన్ 21న తిరిగి ఆ పరీక్ష జరిగింది. ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించారు. సిబిఎస్ఐ పరీక్ష ఫలితాలు వచ్చాయి కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో మసక స్కానింగ్, మాయమైన పేజీలు, తారు మారైన జవాబు పత్రాలు వెరసి పేపర్ల మూల్యాంకనంలో నిర్లక్ష్యం బయటపడింది. కాని కాక్ క్రోచ్ ఉద్యమకారులు ఈ విషయం పట్టించుకోలేదు. NEET ప్రశ్నాపత్రం లీకేజీ అంశానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఎప్పుడైతే CJP ఈ అంశాన్ని తీసుకుందో పిల్లలు, పెద్దలు అందరూ దానికి కనెక్ట్ అయ్యారు. దాంతో మతం, కులం, ప్రాంతం, జాతి, పార్టీలకు అతీతంగా మద్ద తు లభించింది. బహుశా CJP కూడా ఇంత మద్దతు లభిస్తుందని ఊహించి ఉండదు. ఇదే అదనుగా BJP వ్యతిరేక, జాతి వ్యతిరేక శక్తులు CJP వెంట నిలిచాయి.
20 14 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదని అనేక విదేశీ శక్తులు కోరుకున్నాయి. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత మోదీ వెనుదిరిగి చూడలేదు. 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించాడు. అధికారంలో ఉన్న పన్నెండు సంవత్సరాల కాలంలో మోదీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న అనేక ప్రయత్నాలను ఎదుర్కొని నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రస్తుతం లేదా గతంలో దానితో అనుబంధం ఉన్న వ్యక్తులు భారతదేశంలో ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదోసే (regime change) ప్రయత్నాలకు కేంద్రబిందువుగా ఉన్నారు.
విదేశీ కార్యాచరణ నమూనాలు (toolkits) మొదటిసారిగా 2019–2020 CAA వ్యతిరేక ఉద్యమం, ఆ తరువాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాలలో ఉపయోగిం చబడ్డాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తుల ప్రకారం, AAPకు చెందిన సంజయ్ సింగ్ సహా పలువురు ప్రతిపక్ష నాయకులకు ప్రస్తుతం నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో పాటు, భారతదేశంలో అరాచక పరిస్థితులను సృష్టించేందుకు నిధులు సమకూర్చిన ఇతర నెట్వర్క్ సంబంధాలు ఉన్నాయి. అలాగే, CAA వ్యతిరేక ఉద్యమం మరియు రైతుల నిరసనలకు యోగేంద్ర యాదవ్ ముందుండి నాయకత్వం వహించాడు. ఈ రెండు ఉద్యమాలు చివరకు హింసకు దారితీశాసాయి. అయితే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం మాత్రం వారికి సాధ్యపడలేదు.
దానితో అరాచక కార్యాచరణ నమూనాలోని రెండో దశలో తప్పుడు కథనాలకు రూపకల్పన చేసి ప్రచారం చేయడం (narrative building) ప్రారంభించబడింది. అందులో భాగంగానే దేశంలో ఎన్నికల ప్రక్రియ ఏకపక్షంగా ఉందని, అల్పసంఖ్యాకులకు భద్రత లేదని, మోడీ నియంతగా మారిపోయాడని, అవినీతి తారాస్థాయిలో ఉందని దేశ విదేశాల్లో ప్రచారం చేస్తున్నారు. అంతర్జాతీయ ఇస్లామిక్-వామపక్ష (Islamo-leftist) వర్గాలు మోదీ ప్రభుత్వాన్ని ‘హిందూ జాతీయవాద’, ‘ఫాసిస్టు హిందుత్వ పాలన’గా అభివర్ణిం చటం మొదలెట్టారు.
ప్రభుత్వాలను కూలదోయాలనుకునే వర్గాలు సామాజిక మాధ్యమాల మైక్రోటార్గెటింగ్ (microtargeting) ద్వారా ప్రజలను చిన్న చిన్న సమూహాలుగా విభజిస్తారు. ఉమ్మడి విలువల ఆధారంగా కాకుండా, భయం లేదా అసంతృప్తి ఆధారంగా తాత్కాలిక (temporary) లేదా పాప్-అప్ గుర్తింపులు (pop-up identities) సృష్టించడం ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తారు. ఈ డిజిటల్ గుంపు మనస్తత్వాన్ని (digital mob psychology) కాక్రోచ్ జనతా పార్టీ, దాని మద్దతుదారులు అనుసరించారు. కార్ల్ మార్క్స్, జీన్ షార్ప్, స్ట్రా పోపోవిచ్ రచనలు సైద్ధాంతిక దిశను అందించినప్పటికీ, నేపాల్లో జరిగిన ప్రయోగం CJP ఉద్యమాలకు ఒక కార్యాచరణ నమూనాగా పనిచేసింది.
వక్ఫ్ వ్యతిరేక ఉద్యమాలు హింస, అరాచక పరిస్థితులకు దారితీసినప్పటికీ, ఆ అంశం ప్రధానంగా ముస్లింలకు సంబంధించినదిగా ఉండటంతో, దానిని విస్తృత ప్రజా ఉద్యమానికి నాందిగా ఉపయోగించలేకపోయారు. అయితే, 2026 మే 15న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ కోర్టులో చేసిన వ్యాఖ్యల్లో, తమ వృత్తుల్లో ఉపాధి పొందలేని యువకులు “కాక్రోచ్ మాదిరిగా” RTI ఉద్యమం, సామాజిక మాధ్యమాలు, పాత్రికేయ రంగం వైపు మళ్లి, వ్యవస్థపై దాడి చేసే “సమాజపు పరాన్నజీవులు” గా మారుతున్నారని పేర్కొన్న వ్యాఖ్యలు, CJPకి కావలసిన ఆరంభ ప్రేరణగా మారాయి.
నకిలీ డిగ్రీలు కలిగిన వ్యక్తుల గురించి మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశించబడ్డాయని కోర్టు తరువాత స్పష్టం చేసినప్పటికీ, అప్పటికే అభిజీత్ దిప్కే భారత యువతను అవమానించారనే భావనను ఒక రాజకీయ ఆయుధంగా మలిచి, యువతలో ఉన్న అభద్రతాభావాన్ని, ఆగ్రహాన్ని ఉపయోగించుకున్నాడు. దిప్కే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించగా, అది కొద్ది రోజుల్లోనే 20 మిలియన్లకు పైగా అనుచరులను సంపాదించింది. అయితే అందులో మూడవవంతు పాకిస్తాన్ నుండీ మద్దతు పలికినవారే!
జూలై 20న మాత్రమే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనను గుర్తించి, దాని నాయకులతో ముఖాముఖి సమావేశం జరిపింది. ఆరోగ్య మంత్రి జె. పి. నడ్డాతో CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా సమావేశమైన దృశ్యాలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చిన వెంటనే, దాదాపు అజేయంగా భావించే మోదీ ప్రభుత్వం కూడా కాక్రోచ్ ముందు తలవంచుతోందనే కథనం వేగంగా వ్యాపించింది.
ఇదిలా ఉండగా, ఊహించినట్లుగానే నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. రాళ్లు విసిరిన, దాడులకు పాల్పడిన CJP నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసులు ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) ప్రకారమే వ్యవహరించినప్పటికీ, ప్రభుత్వం, పోలీసులు ‘విద్యార్థి నిరసనకారులను’ ‘ఉగ్రవాదుల’లా పరిగణిస్తూ వారిపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారనే కథనం బాగా వ్యాప్తి చెందింది. మోడీ ప్రభుత్వం 2026లో కుప్పకూలుతుందని రాహుల్ గాంధీ అనేకసార్లు జోస్యం చెప్పాడు. కాక్రోచ్ ఉద్యమం అందులో భాగంగా చేపట్టినదన్న అనుమానం నిజం కాకూడదని కోరుకుందాం.. నియంతలను పదవిచ్యుతులను చేయటానికి ఉద్దేశించిన కార్యాచరణ పద్ధతులను ప్రజాస్వామిక పద్ధతులలో ఎన్నికైన నేతలను, ప్రభుత్వాన్ని కూలదోయటానికి ఉపయోగించడం సహేతుకం కాదు. సమర్ధనీయం కాదు. ఇది అరాచకానికి దారితీస్తుంది. భారతదేశంలో అరాచక పరిస్థితులను ప్రేరేపించేందుకు సంవత్సరాల పాటు సాగిన శిక్షణ, కథన నిర్మాణం, నిధుల సమీకరణ వంటి ప్రక్రియల పరాకాష్టే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆవిర్భావానికి దారితీయ లేదుకదా!
NEET అక్రమాలు బయటపడగానే కఠినమైన చర్యలకు ఉపక్రమించి ఉంటే CJP ఆందోళనకు ఇంత మద్దతు లభించి ఉండేది కాదు. నాడు వ్యవసాయ చట్టాలపై ఆందోళన, నేడు NEET అక్రమాలపై అందోళన రెండూ మోడీ ప్రభుత్వం మెడలు వంచాయి. ఇప్పటికైనా కొత్తతరం, కొత్తరకపు నిరసన పద్దతులను ఎంచుకొంటున్నదన్న విషయాన్ని గ్రహించి, వారి ఆకాంక్షలకు, ఆశలకు తగ్గట్లుగా పాలనా సంస్కరణల ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొనివచ్చేందుకు కృషి చేస్తారని ఆశిద్దాం.
-డా|| బి. సారంగపాణి, 94408284876




