ArticlesNews

చైనా తానా మీడియా తందానా?

188views

చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీ అక్కడి మీడియాను కూడా నియంత్రిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అక్కడి మీడియా ప్రచార సాధనంగా పని చేస్తోంది. తాజాగా గ్లోబల్ టైమ్స్, చైనా టైమ్స్ వంటి మీడియా సంస్థలను కరోనా వైరస్ విషయంలో సమాచార యుద్ధ సైనికులుగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం విస్తృతంగా వాడుకుంటోంది. ఆ ప్రభావం కేవలం తన దేశం వరకే కాదు విదేశాలకు కూడా వ్యాపింపజేసింది. విదేశీ  మీడియాని కూడా కొనేసి తన అజెండాను చొప్పించింది. 2018లోనే విదేశాల్లో ఉన్న మీడియాను మేనేజ్ చేయడం కోసం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా తన ఎజెండాని అమలు చేయాలనే ఉద్దేశ్యంతో  చైనా విదేశీ మీడియా తనకు బాసటగా ఉండాలని కోరుకుంది. ప్రపంచ దేశాల తోపాటు జర్నలిస్టుల మెదడుల్లో   అధ్యక్షుడు జిన్ పింగ్  ఆలోచనల తోపాటు చైనా విధానాలను చొప్పించడానికి ‘శక్తివంతమైన దేశాన్ని అధ్యనం చేయండి’ అనే పేరుతో మొబైల్ యాప్ ని రూపొందించిందని వియాన్ టీవీ ఇటీవలే ఒక రిపోర్ట్ తన ఛానెల్ లో ప్రసారం చేసింది.

అంతే కాదు ఆసియా మరియు ఆఫ్రికా జర్నలిస్టుల ఫెలోషిప్ కార్యక్రమం నిర్వహించి చైనా సిద్ధాంతాలను ఆయా దేశాలలో ప్రచారం చేయడానికి ఒప్పించే ప్రయత్నం చేసింది. 2016 నుండి ప్రతి సంవత్సరం వంద మంది జర్నలిస్టులకు ముఖ్యంగా పేదరికంతో ఉన్న దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల వారికి వల వేసింది చైనా.  వారిని శిక్షణలో పాలుపంచుకునేలా చేసింది. ఇప్పటి వరకు పేద దేశాలపైనే దృష్టి పెట్టిన చైనా ఐరోపా దేశాలకు కూడా త్వరలో ఈ ప్రయోగాన్ని విస్తరించాలనుకుంటోంది అని వియాన్ టీవీ తన రిపోర్ట్ లో వివరించింది.

భారత్, బంగాళాదేశ్, పాకిస్థాన్ దేశాలకు చెందిన ప్రభావవంతమైన మీడియా సంస్థల నుండి జర్నలిస్టులు చైనా ఫెలోషిప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం నుండి ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్ (ఐఏఎన్ఎస్) జర్నలిస్టులు పాల్గొన్నారు. చైనా డైలీ బీజింగ్ ప్రచురణ, కమ్యూనిస్ట్ పార్టీ ఇంగ్లీష్ వార్తాపత్రిక ‘ఇక్కడకు సందర్శించిన జర్నలిస్టులు ఒక ప్రకాశవంతమైన నివేదిక సమర్పించారు’ అని వ్యాసం ప్రచురించారు. ఆ రిపోర్ట్ ఆన్ లైన్ లోనూ ప్రచురితమైంది. ఆ తర్వాత వెబ్ సైట్ నుండి తొలగించింది. ఆ రిపోర్ట్ గురించి వెతికే ప్రయత్నం చేస్తే ‘404 నాట్ ఫౌండ్’ అనే సందేశం వస్తుంది.

ఈ కార్యక్రమాన్ని ముందు ఆఫ్రికా జర్నలిస్టుల నుండి చైనా ప్రారంభించింది. మీడియాని అదుపులో పెట్టుకొనే ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత దక్షిణాసియాతో సహా ఆసియా జర్నలిస్టులకు విస్తరించింది. ఒక్కో ప్రాంతం జర్నలిస్టులకు ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఉదాహరణకు చైనా ఆఫ్రికా ప్రెస్ సెంటర్ (సిఏపిసి) అని, చైనా సౌత్ ఆసియ ప్రెస్ సెంటర్స్(సిఎస్ఏపిఎస్), చైనా సౌత్ ఈస్ట్ ఆసియ ప్రెస్ సెంటర్స్(సిఎస్ఈఏపిఎస్) అని వేరు వేరు కేంద్రాలను ఏర్పరిచింది. ఈ కేంద్రాలన్నిటినీ చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  చైనా పబ్లిక్ డిప్లమసీ అసోసియేషన్ పర్యవేక్షిస్తాయి. ఈ విధంగా జర్నలిస్టులను మచ్చిక చేసుకోవడం ద్వారా ఆ దేశం విదేశీ మీడియాను  తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకుంటున్నది. దీని  ప్రభావం 2018లో భారత మీడియాలో వచ్చిన ఒక వ్యాసంలో స్పష్టంగా కనిపించింది. భారత మీడియాలో ఒక కథనం ప్రచురణ అయింది. దాని ప్రకారం, శ్రీలంక రాజకీయాల్లో భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీ- రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) కుయుక్తులు పన్నుతోందని ఆ దేశ అధ్యక్షుడు ఆరోపించినట్టు పేర్కొంది ఆ వార్తా కథనం. అయితే దానిని శ్రీలంక అధ్యక్షుడు వెంటనే ఖండించారు. ఈ కథనం భారత, శ్రీలంక సంబంధాలపై పెను ప్రభావం చూపెట్టి చైనాకు లాభం చేకూరుస్తుంది. డోక్లామ్ విషయంలో కూడా ఇండియా మీడియాలో కొందరు చైనాకు అనుకూలంగా కథనాలు ఇచ్చారు. ఇదే కాదు ఇంకా కొన్ని కథనాలు చైనాకు సానుకూలంగా ఉన్నవి  ఇండియా మీడియాలో దర్శనం ఇచ్చాయి. భారతదేశ జాతీయ ప్రయోజనాలను సైతం పక్కన పెట్టి చైనాకు అనుకూలంగా కొన్ని  ఇండియా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ‘చైనా యొక్క  మావో మా అధ్యక్షుడు, చైనా యొక్క అధ్యక్షుడు మా అధ్యక్షుడు’ అనే కమ్యూనిస్ట్ పార్టీ పాత నినాదాన్నే భారత మీడియా సంస్థలు వల్లె  వేసిన పరిస్థితి గోచరించింది.

రచన : అమిత్ అగ్రహారి

Source :  TFIPOST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.