News

డిల్లీ సమావేశ నిర్వాహకులపై కేసులు

560views

దేశరాజధానిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్‌ తదితరులపై ‘అంటువ్యాధుల చట్టం 1897’ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.ఎన్‌. శ్రీవాత్సవ తెలిపారు. అంతేకాకుండా ఈ మర్కాజ్‌కు హాజరైన 12 మంది విదేశీయులు సమాచారాన్ని దాచి ఉంచినందుకు జామా మసీదు వజీరాబాద్‌ ఇమామ్‌పై కూడా కేసు నమోదు చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేఖ రాసిన విషయం విదితమే.

మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన ఈ సమావేశానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఒక్క మంగళవారమే 146 కొత్త కేసుల నమోదుతో భారత్‌లో కరోనా కేసులు 1397కు ఎగబాకాయి. ఇప్పటి వరకు 35 మంది కొవిడ్‌-19 సోకి మరణించగా 123 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయినట్టు అధికారులు తెలిపారు.

అజిత్‌ దోవల్ జోక్యంతో కొనసాగిన తరలింపు..

నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో ఉన్న వ్యక్తులను తరలింపు కార్యక్రమం మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. అక్కడి ఉన్నవారిని తరలించేందుకు తొలుత నిర్వాహకుడు మౌలానా సాద్‌ సహకరించకపోవడంతో నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ అజిత్‌ దోవల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన మార్చి 28వ తేదీ అర్ధరాత్రి రంగంలోకి దిగి అక్కడి మౌలానాను ఒప్పించారు. దీంతో అక్కడి వారి తరలింపు మొదలైంది. వీరిలో చాలా మంది వీసా నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడకు వచ్చినట్లు తేలింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.