News

విద్యా భారతి సంస్థ ద్వారా ప్రతి విద్యార్థికీ భారతీయ సంప్రదాయాలు

2views

జబల్ పూర్ : విద్యా భారతి సంస్థ ద్వారా ప్రతి విద్యార్థికీ భారతీయ సంప్రదాయాలకు సంబంధించిన సంస్కారాలు అందాలని, ఈ మేరకు విద్యా భారతి కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ డా. కృష్ణ గోపాల్ అన్నారు. విద్యా భారతి కేవలం పరీక్షల నిర్వహణ, పరీక్షల ఫలితాలకే పరిమితం కాకూడదని అన్నారు. జబల్ పూర్ వేదికగా జరిగిన మూడు రోజుల విద్యా భారతి అఖిల భారతీయ కార్యకారిణి ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జరిగిన బోర్డు పరీక్షలలో విద్యా భారతి పాఠశాలల విద్యార్థులు 95 శాతానికి పైగా విజయం సాధించారని, వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

విద్యా భారతి ద్వారా విద్యార్థులకు భారతీయ నేలకు సంబంధించిన సంస్కారాలు అందాలని, దీని ద్వారా సమాజం, కుటుంబం, దేశం పట్ల వారంతా బాధ్యతాయుతమైన భావనతో, ఆదర్శపౌరులుగా ఎదిగేలా చూడాలన్నారు. కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా, పిల్లలు ఆధ్యాత్మిక దృక్పథాన్ని కూడా పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఈ లక్ష్యంతో, విద్యా భారతి పాఠశాలలు తమ విద్యా విధానంలో ‘పంచకోశ వికాసం’ అనే భావనను అనుసరిస్తున్నాయని తెలిపారు. ఈ పంచకోశ వికాస ఆధారిత విద్య ద్వారా విద్యార్థుల సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, ఆ దిశలో వారికి పునాదులు పడతాయన్నారు.

జాతీయ విద్యా విధానం (NEP2020) అమలులో విద్యా భారతి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని కృష్ణగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా విద్యా భారతి విద్యతో పాటు విలువలను అందిస్తూనే, విద్యా రంగంలో తన పాత్రను కొనసాగిస్తూనే వుండాలని సూచించారు. దేశ మంతటా విద్యా భారతి కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.

మరో వైపు అఖిల భారత ప్రధాన కార్యదర్శి దేశ్‌రాజ్ శర్మ ‘విద్యా భారతి’ కార్యకలాపాల విస్తరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంస్థ దేశవ్యాప్తంగా 685 జిల్లాల్లో పనిచేస్తోందని ఆయన తెలిపారు.దేశవ్యాప్తంగా సుమారు 24,000 అధికారిక మరియు అనధికారిక పాఠశాలలు పనిచేస్తున్నాయని, ఈ ఏడాది దాదాపు 37 లక్షల మంది విద్యార్థులు వాటిలో చేరారని ఆయన తెలిపారు. 1.70 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు బోధనలో నిమగ్నమై ఉన్నారన్నారు.దేశవ్యాప్తంగా 280 రెసిడెన్షియల్

పాఠశాలలు మరియు 1,041 గిరిజన పాఠశాలలను కూడా విద్యా భారతి నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.
అఖిల్ భారతీయ స్పోర్ట్స్ మీట్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరగనుందని, అలాగే హర్యానాలోని కురుక్షేత్రలో అఖిల భారతీయ సంస్కృతి మహోత్సవం,ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అఖిల భారతీయ విజ్ఞాన మేళా; జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అఖిల భారతీయ గణిత్ మేళా; మరియు IIT రూర్కీ, ఉత్తరాఖండ్‌లో అఖిల్ భారతీయ టెకాథాన్-3 జరగనున్నాయని వెల్లడించారు.

సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, విద్యా భారతి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర కన్హేరే మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో సంస్థ తన కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించుకుందని తెలిపారు.
విద్యా భారతి ఇప్పుడు తన పాఠశాలల డిజిటలైజేషన్ దిశగా ముందుకు సాగాలి మరియు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో అగ్రగామిగా నిలిచేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.