News

ఆరుగురు పాస్టర్లకు ఐదేళ్ల జైలు శిక్ష..

27views

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో హిందూ వ్యతిరేక విద్వేషం, బలవంతపు మతమార్పిడి కేసులో ఆరుగురు పాస్టర్లకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దిండోరి సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. 2024 ఏప్రిల్ 27న పిపారియా గ్రామంలోని సుదయ్ సింగ్ మరావి ఇంట్లో జరిగిన మత మార్పిడి సమావేశానికి సంబంధించిన కేసులో, మధ్యప్రదేశ్‌లోని దిండోరి సెషన్స్ కోర్టు ఏడుగురు వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. అలాగే మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, 2021లోని సెక్షన్లు 3 మరియు 5 కింద, ఏడుగురు నిందితులలో ప్రతి ఒక్కరికీ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 1 లక్ష జరిమానా విధించింది.

క్రైస్తవ మత ప్రచారం చేసేందుకే నిందితులు సమావేశమయ్యారని, డబ్బు ప్రలోభాలు, పేదరికం, బాధల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రలోభాలకు గురి చేస్తూ, అక్రమ మత మార్పిళ్లకు తెర లేపారని , అలాగే హిందూ మత విశ్వాసాలను, దేవుళ్లను అవమానించేలా వ్యాఖ్యలు కూడా చేశారని కోర్టు నిర్ధారించింది.దిండోరిలోని రెండవ అదనపు సెషన్స్ న్యాయమూర్తి శివ్ కుమార్ కౌశల్ ఈ తీర్పునిచ్చారు.

ఈ కేసును మొదట సమనాపూర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 153A (సెక్షన్ 34తో కలిపి), IPC సెక్షన్ 295A (సెక్షన్ 34తో కలిపి) మరియు మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం-2021లోని సెక్షన్లు 3, 5 కింద FIR నం. 210/2024గా నమోదు చేశారు. చివరకు, ఈ నిబంధనల కింద ఏడుగురు నిందితులనూ కోర్టు దోషులుగా నిర్ధారించింది.

అయితే.. నిజానికి సుదయ్ మరావి ఇంట్లో జరుగుతున్న ఈ అక్రమ మత మార్పిడి గురించి అంగద్ సింగ్ మరావి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 2024 ఏప్రిల్ 27కి ముందు కొన్ని రోజుల పాటు, కరణ్ సింగ్ మరావి మరియు ఇతర నిందితులు సుదయ్ ఇంటికి వెళ్తూ, అతన్ని క్రైస్తవ మతాన్ని స్వీకరించేలా ఒప్పించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. నిందితులు నిందితులు ఒక ఇంట్లో క్రైస్తవ మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న అంగద్ సింగ్ మరావి, తన తండ్రి, బాబాయి మరియు మరో బంధువుతో కలిసి అక్కడికి వెళ్లారు. వారు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నప్పటికీ నిందితులు దానిని కొనసాగించడంతో, గ్రామ సర్పంచ్ మరియు ఇతర వ్యక్తులను అక్కడికి పిలిపించారు. అయితే.. ఇది కేవలం ఓ ప్రార్థనా సమావేశం మాత్రమే కాదని, స్థానికుల్లో కొందరు హిందూ ధర్మం వీడేలా వీరు ప్రోత్సహిస్తూ వచ్చారని ఫిర్యాదు దారులు పేర్కొంటున్నారు.

క్రైస్తవ మతం అత్యుత్తమమైనదని, దానిని అనుసరించేవారే అత్యధిక సంఖ్యలో లేదా అత్యంత సంతోషంగా ఉన్నారని, అలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరించడం వల్ల ప్రజలకు వ్యాధులు మరియు బాధల నుండి రక్షణ లభిస్తుందని నిందితులు చెబుతుండేవారని సాక్షులు కోర్టుకు తెలిపారు.హిందూ ధర్మం హీనమైనదని, హిందూ దేవుళ్లను పారేసి, పూజలు మానేసి, బదులుగా యేసును స్వీకరించాలని నిందితులు అక్కడ ఉన్న ప్రజలతో చెబుతున్నారని కూడా తెలిపారు.