
కాఠ్మాండు: నేపాల్ రాజకీయాల్లో సనాతన ధర్మం, హిందూ దేశం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. “నేను హిందువును.. నేను ఆచరించే ధర్మం గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.
నేపాల్ జాతీయ గుర్తింపును సనాతన ధర్మంతో అనుసంధానించడంపై దేవుబా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే నేపాల్‌ను తిరిగి హిందూ దేశంగా ప్రకటించాలా? వద్దా? అనే నిర్ణయం మాత్రం ఆ దేశ ప్రజలే తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
సనాతన ధర్మంతో పాటు బౌద్ధ, కిరాత్ సంప్రదాయాలకు ప్రాధాన్యం
నేపాలీ కాంగ్రెస్ 14వ జాతీయ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి తీర్మానం ఆమోదించినట్లు సమాచారం. అయితే ఈ తీర్మానం కేవలం హిందూ మతానికే పరిమితం కాలేదు. సనాతన ధర్మంతో పాటు బౌద్ధ, కిరాత్ సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని కూడా అందులో ప్రస్తావించారు.
అన్ని మతాలు, వర్గాల మధ్య మత స్వేచ్ఛ, పరస్పర సహనం, సామాజిక సామరస్యాన్ని కాపాడాలని తీర్మానం పిలుపునిచ్చింది. దీంతో నేపాల్‌ను తిరిగి హిందూ దేశంగా ప్రకటించాలనే డిమాండ్‌కు రాజకీయంగా కొంత మద్దతు లభిస్తుందనే చర్చ మొదలైంది.
‘నేను హిందువును’.. దేవుబా స్పష్టీకరణ
దేవుబా మాట్లాడుతూ.. “నేను హిందువును. నేను ఆచరించే మతం గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది. హిందూ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ నాకు ఉండాలి. నేపాల్ హిందూ దేశంగా మారాలా? వద్దా? అనేది నేపాల్ ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం” అని అన్నారు.
అయితే నేపాల్‌ను హిందూ దేశంగా మార్చాలనే డిమాండ్‌కు దేవుబా నేరుగా మద్దతు ప్రకటించలేదు. తన వ్యక్తిగత హిందూ గుర్తింపును మాత్రం ఆయన బహిరంగంగా వెల్లడించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
హిందూ సంస్థల స్వాగతం
దేవుబా వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ లుంబినీ ప్రాంతీయ అధ్యక్షుడు త్రిభువన్ మిశ్రా, వీఎచ్‌పీ రూపందేహి అధ్యక్షుడు ఖేమ్ భూషల్, హిందూ స్వయంసేవక్ సంఘ్ రూపందేహి అధ్యక్షుడు గోకుల్ పోఖరెల్, హిందూ ధర్మ సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ గుప్తా తదితరులు స్వాగతించారు.
నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటించాలనే డిమాండ్‌తో విస్తృత ప్రచారం చేపట్టేందుకు హిందూ సంస్థలు కలిసి పనిచేయనున్నట్లు వారు తెలిపారు.
‘దేవుబాకు చాలా ఆలస్యంగా తెలిసింది’
కపిలవస్తు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపాల్ పార్లమెంట్ సభ్యుడు అభిషేక్ షా కూడా దేవుబా వ్యాఖ్యలపై స్పందించారు. తాను హిందువుననే విషయాన్ని గుర్తించడానికి దేవుబాకు చాలా సమయం పట్టిందని వ్యాఖ్యానించారు. నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటించాలనే డిమాండ్‌ను తాను చాలా కాలంగా వినిపిస్తున్నానని తెలిపారు.





